భక్తుల తాకిడి
చిలుకూరులో..
కలియుగ దైవం... భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి దర్శనంకోసం ఉదయం 6 గంటల నుంచే క్యూకట్టారు. 8 గంటల నుంచి రద్దీ పెరగడంతో గర్భగుడి దర్శనాలు నిలిపివేసి మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు 11, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికిప్రత్యేక పూజలు నిర్వహించారు.
-మొయినాబాద్
చీర్యాలలో..
చీర్యాల లక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు నగరం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ప్రసాదాల కొరత రాకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ మల్లాపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- కీసర