కలిసి పోయారు
వారిద్దరూ మంచి స్నేహితులు. అనివార్య కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు దూరమయ్యారు. పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఇద్దరూ మళ్లీ కలిశారు. స్నేహితులిద్దరూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సరదాగా ఈతకొట్టేందుకు చెరువుకు వెళ్లారు. నీటిలో కలిసిపోయారు. ప్రయోజకులై ఉద్దరిస్తారనుకున్న పిల్లలు ఉన్నట్టుండి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అన్నీఇన్నీ కావు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. విద్యార్థుల మృతితో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ఆదివారం చిత్తూరు రూరల్ మండలం మిట్టఇండ్లు గ్రామంలో చోటుచేసుకుంది.
చిత్తూరు రూరల్ : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందారు. పోలీసుల కథ నం మేరకు.. చిత్తూరు రూరల్ మిట్ట ఇండ్లు గ్రామానికి చెందిన మునిరాజులు, లలిత రెండవ కుమారుడు కిరణ్‌కుమార్(14) మాపాక్షి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అలాగే నరిగపల్లెకు చెందిన మురగయ్య, కవిత దంపతుల ఏకైక కుమారుడులోకేష్ (14) సిద్దంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. లోకేష్ మిట్ట ఇండ్లులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ మాపాక్షి పాఠశాలలో 7వ తరగతి వరకు చదివాడు. ఆ సమయంలో కిరణ్‌కుమార్‌తో మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి మెలసి తిరిగేవారు. ప్రాణస్నేహితులుగా మారారు. కొన్ని కారణాల వల్ల లోకేష్‌ను వారి తల్లిదండ్రులు సిద్దంపల్లి పల్లి పాఠశాలలో చేర్పించారు. దీంతో స్నేహితుల మధ్య దూరం పెరిగింది.
ఇద్దరూ కలవాలని చాలాసార్లు అనుకున్నా కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో లోకేష్ శనివారం రాత్రి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్‌కుమార్ ఎగిరి గంతేశాడు. ఆదివారం స్నేహితులు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో సరదాగా ఈతకొట్టేందుకు సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. చెరువులోని లోతైన గుంతలో మునిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని 11.15 గంటల ప్రాంతంలో విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.
రెండు కుటుంబాల్లో విషాదచాయాలు
విద్యార్థుల మృతితో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిపోయాయి. తల్లిదండ్రుల రోదన చూసి గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు. ఒక్కగానొక్క కొడుకు అందనంత దూరం వెళ్లిపోయాడంటూ లోకేష్ తల్లి కన్నీరుమున్నీరైంది.
చెరువుల వద్ద భద్రత శూన్యం
ఇటీవల ఈతకు వెళ్లి మృతిచెందుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువుల వద్ద భద్రత ఏర్పాటు చేయడం లేదు. తల్లిదండ్రులతో పాటు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా విద్యార్థుల ప్రాణాలు నీటిలో కలిసిపోయే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.