మల్టీస్టారర్ సాహసమే..
నిర్మాత అశ్వనీదత్
ఎన్టీఆర్‌తో ‘ఎదురులేని మనిషి’, చిరంజీవితో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి బ్లాక్బాస్టర్ సినిమాలు అందించిన నిర్మాత అశ్వనీదత్. జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రెండు రోజులుగా జిల్లాలో ఉన్న ఆయన ‘సాక్షి’తో పలు సినిమా విషయూల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
ప్ర : రాజకీయరంగం నుంచి తప్పుకొన్నారా?
జ : లేదు.. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ప్రచారం చేశాను. వారానికి మూడు రోజులు రాజకీయాలకు కేటాయించాను. వారంలో ఒకరోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమవుతూ ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నాను.
ప్ర : చిత్ర పరిశ్రమ విశాఖపట్నానికి రానుందా..
జ : అటువంటి ఆలోచనే లేదు. చెన్నై నుంచి హైదరాబాద్ తరలించాక ఇప్పటికీ స్థిరపడలేదు. హైదరాబాద్ కూడా మన తెలుగు ప్రాంతమేగా.. అనుకుంటూనే హైదరాబాద్ కేంద్రంగా సినిమాలు నిర్మించాలని సినీ పరిశ్రమ అనుకుంటోంది.
ప్ర : ప్రముఖ నిర్మాతగా సినిమాలు తీయకపోవడానికి కారణం?
జ : పరిశ్రమ నష్టాల బాటలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మేలు.
ప్ర : నష్టాలకు కారణమేమిటీ?
జ : నిర్మాణ రంగంలో నిర్మాత కమాండింగ్ లేకుండాపోయింది. బడ్జెట్ నిర్మాత చేతుల్లో లేదు.
ప్ర : సినిమా రంగం లాభాల బాటలో పయనించడానికి ఏం చేయాలనుకుంటున్నారు?
జ : చిన్నచిత్రాలు విజయం సాధించాలి. అలాంటి సినిమాల నిర్మాణంలో నిర్మాతకు కమాండింగ్ ఉంటుంది. బడ్జెట్ ప్రకారం సినిమా విడుదల చేసే అవకాశాలు ఉంటాయి.
ప్ర : ప్రస్తుతం ఏం సినిమాలు తీస్తున్నారు?
జ : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నవంబర్‌లో ఓ చిత్రాన్ని తీయూలనుకుంటున్నా.
ప్ర : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి ఫాంటసీ సినిమాను మీ నుంచి ఆశించవచ్చా?
జ : రామ్‌చరణ్ హీరోగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. తరువాత పవన్‌కల్యాణ్‌తో సినిమా ఉంటుంది.
ప్ర : భారీ చిత్రాలు నష్టాలు చవిచూస్తున్నాయంటూనే ఆ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కదా.. కారణమేమిటీ?
జ : భారీ చిత్రాలతో పాటు చిన్నచిత్రాలు తీస్తుంటాను. భారీ సినిమాలకు మధ్యలో రెండు చిన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా..
ప్ర : మల్టీస్టారర్‌పై మీ అభిప్రాయం.
జ : ఒక్క హీరోతో సినిమా చేయడానికే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మల్టీస్టారర్ సినిమా నిర్మించాలన్న సాహసం చేసే ఆలోచన లేదు.
ప్రశ్న : బాలీవుడ్-టాలీవుడ్ మధ్య తేడా ఏంటీ?
జ : హిందీ చిత్రరంగానికీ, మనకూ చాలా తేడా ఉంది. హిందీలో కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తున్నా.. నాలుగు నెలల్లో పూర్తయిపోతుంది. తెలుగులో హీరోకు రూ.10కోట్లు కేటాయిస్తున్నా.. సినిమా తీయడానికి మరో రూ.30కోట్లు వెచ్చిస్తున్నా.. పూర్తవడానికి ఏడాదికి పైగా పడుతోంది. కానీ, కారణాలు తెలియట్లేదు. నాటి హీరోల్లో ఉన్న ఐక్యత నేడు కనిపించట్లేదు.