నచ్చకుంటే పెళ్లే చేసుకోను!
నేటి సంచలన యువ తారల పట్టికలో నటి శ్రుతిహాసన్ పేరు తప్పకుండా ఉంటుంది. చాలా విశాల మనస్తత్వం ఆమెది. తన అభిప్రాయాలను నిర్భయంగా, నిస్సంకోచంగా వ్యక్తం చేసే నటి శ్రుతి. భాషా పక్షపాతి కాకుండా ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ భామ ఒక పత్రిక కు ఇచ్చిన భేటీచూద్దాం....
ప్రశ్న: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎలాంటి వ్యక్తి భర్త కావాలని కోరుకుంటున్నారు?
జవాబు: నిజం చెప్పాలంటే ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు. అయితే కాబోయే భర్త విషయంలో కొన్ని ఆశలు ఉన్నాయి. ఆయన నా మనసును దోచుకున్న వాడై ఉండాలి. నా మనసంతా ఆయనే నిండి వుండాలి. నేనాయనతో అన్ని విషయాలు పంచుకోవాలి. ఇలాంటి కోరికలున్నా పెళ్లి చేసుకోవడం అన్న అంశానికి నా ఇష్టానికి వదిలేస్తే అసలా పెళ్లే చేసుకోకూడదనే నిర్ణయం తీసుకుంటాను. వివాహం అనేది సమస్యలతో కూడుకుంది. అలాగని వివాహ సంప్రదాయానికి నేను వ్యతిరేకినని భావించరాదు. నా స్నేహితుల్లో కొందరు అందమైన వివాహ జీవితాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు.
ప్రశ్న: వివాహంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు?
జవాబు: ప్రస్తుతం నాదృష్టి అంతా సినిమాపైనే లగ్నం చేశాను. దాని నుంచి మరల్చే ఆలోచన లేదు. నా జీవితంలో కొన్ని మంచి సంఘటనలు, మంచి స్నేహితులు ఉన్నారు. 20 వసంతాలు దాటిన నా జీవితంలో ఇప్పటి వరకు సాంబారు అన్నం ఇష్టమైన ఆహారంగా ఉంది. అలాగే నాకు కాబోయే భర్త నాకు నచ్చిన సాంబారు అన్నంలా ఉండాలి. లేకుంటే సమస్యలే. అందుకే నచ్చినవాడు లభించకపోతే వివాహమే చేసుకోను.
ప్రశ్న: చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?
జవాబు: పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే ఎంపిక చేసుకుంటాను. ఇందులోను కొన్ని సమస్యలు వున్నా మంచే ఎక్కువ ఉంటుంది. నా తల్లిదండ్రులు చిత్ర రంగానికే చెందిన వారే. కాబట్టి ఈ రంగానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడం తెలివైన పని.
ప్రశ్న: అలాంటి వారెవరైనా తారసపడ్డారా?
జవాబు: ఇప్పటి వరకు లేదు.
ప్రశ్న: మీ సోదరి అక్షర కూడా నటిగా రంగ ప్రవేశం చేశారు. ఆమెకు సలహాలేమైనా ఇస్తారా?
జవాబు: ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వను. ఎందుకంటే సినిమా రంగంలో మేమెలా ఉండాలన్న విషయాలు గురించి మా అమ్మానాన్నలు చెప్పలేదు. అయినా అక్షర తెలివైన అమ్మాయి. తన భవిష్యత్తును తనే నిర్ణయించుకుంటుంది.