chittalur
-
చెట్టు కిందే ప్రసవం
మహిళకు మాతృత్వం ఓ వరం. కాన్పు జరిగిందంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఆధునిక పాలనలో సాంకేతిక వసతులు పెరగినా, ఆస్పత్రులు అందుబాటులో ఉన్నా అక్షర జ్ఞానం లేని సంచార జీవులైన గిరిజనులు పాతపోకడలనే అనుసరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ గిరిజన మహిళ చెట్టు కిందనే పండంటి మగ బిడ్డను ప్రసవించిన సంఘటన చేజర్ల మండలంలోని చిత్తలూరులో చోటు చేసుకుంది. సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఈగ వెంకటేశ్వర్లు, చెంచమ్మ గిరిజన దంపతులు. వీరు వీధుల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు సేకరించి, వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఒక ఊరు అని లేక జీవనం కోసం పలు గ్రామాల్లో వీరు సంచరిస్తుంటారు. వీరికి ఇప్పటికే ముగ్గురు(7,5,3 ఏళ్ల వయసు కలిగిన) పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో చెంచమ్మ మరోసారి గర్భం దాల్చింది. పగలంతా ప్లాస్టిక్ వస్తువులు సేకరించుకుంటూ గడిపే వీరు రాత్రిళ్లు ఖాళీగా ఉన్న పాఠశాలల వరండాల్లో రోడ్డు పక్కన వెడల్పుగా ఉన్న కల్వర్టుల కింద తలదాచుకుంటారు. ఈ నేపథ్యంలో చెంచమ్మకు నెలలు పూర్తి కావడంతో ఆమె భర్త వెంకటేశ్వర్లు, తమ సమీప బంధువులు చిత్తలూరు గ్రామంలో ఉన్నారు. వీరు కాన్పు కోసం వారింటికి ఆదివారం వెళ్లారు. అయితే వీరు వెళ్లిన సమయంలో వారి బంధువులు అక్కడ లేరు. దీంతో తిరిగి చేజర్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. నడిచి వస్తున్న నిండు గర్భిణి చెంచమ్మకు కాన్పు నొప్పులు అధికమయ్యాయి. సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కనే చెట్టు కింద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఎవరూ తోడు లేక ఆ గిరిజన దంపతులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం తల దాచుకునేందుకు సోమవారం సెలవు దినం కావటంతో ఆదురుపల్లిలోని ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. మంగళవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరి పరిస్థితిని గుర్తించి భోజన సదుపాయం కల్పించారు. గ్రామంలోని మహిళలు పలువురు చెంచమ్మకు చీరలు ఇచ్చారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న చిత్తలూరు పీహెచ్సి వైద్య సిబ్బంది ఐసీడీఎస్ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. బాధితులైన గిరిజనులకు తగిన మందులు, ఆహారం అందించారు. పలువురు దాతలు ఆహార పదార్థాలతో పాటు దుస్తులు కూడా ఇచ్చారు. -
చిత్తలూరులో ఘనంగా బోనాల పండుగ
చిత్తలూరు(శాలిగౌరారం) మండలంలోని చిత్తలూరు గ్రామంలో మంగళవారం మహంకాళమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మహంకాళమ్మ దేవతకు దూపదీపనైవేద్యాలను బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలతో తమ పాడిపంటలు మంచిగా వృద్ధిచెందాలని కోరుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక సర్పంచ్ బొమ్మగాని రవి, ఎంపీటీసీ సుంకరి కరుణ వీరయ్య, ఉపసర్పంచ్ తరాల సువర్ణ అంతయ్య, మండల కోఆప్షన్ సభ్యులు దాసరి దేవచిత్తం, నాయకులు జయప్రకాశ్, శ్రీను, కొండల్కుమార్, నతానియేల్, కృష్ణమోహన్, మల్లయ్య, పాపయ్యలు దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.