chittis
-
ఐదుగురు ఎస్సైలను మోసం చేసిన కి‘లేడీ’ మరో అవతారం
సాక్షి, హైదరాబాద్: మోసం చేయడంలో ఆమె దిట్ట. అమాయకులనే కాదు ఏకంగా పోలీసులను కూడా మోసం చేయడం ఆమె గొప్పతనం. ఐదు మంది ఎస్సైలను మోసం చేసిన ఆమె ఇప్పుడు మరో సరికొత్త అవతారంలో బయట తిరుగుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని అందిక కాడికి దోచుకుంటోంది. ఆ మహిళ బారినపడి మోసపోయిన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆ బాధితులు కోరుతున్నారు. ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. గతంలో ఐదు మంది ఎస్ఐలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నది కిలాడి లేడి శ్రీలతా రెడ్డి. ఆమె ఇప్పుడు మరో నయా దందాతో ప్రజలని మోసం చేయడం మొదలుపెట్టింది. చిట్టీల పేరుతో అమాయక ప్రజలను బృందంగా చేసి 5 లేదా 6 నెలలు కట్టించుకున్న బిచాణా ఎత్తి వేస్తుంది. ఇదేంటి? అని బాధితులు ప్రశ్నిస్తే.. బ్లాక్ మెయిల్ చేస్తుందని వాపోతున్నారు. నేను పోలీస్‌లపైనే కేసు పెట్టాను.. మీరెంత అంటూ బెదిరింపులకి పాల్పడుతుందని ఆమె బాధితులు చెబుతున్నారు. ఇలా మూడు చిట్టీల పేరుతో ఏకంగా ఆమె 60 మందిని మోసం చేసింది. ఆమె గురించి వనస్థలిపురంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి బాధితులు తమ గోడు చెప్పుకొచ్చారు. గతంలో శ్రీలతారెడ్డిపై ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయితే డబ్బులు ఉన్న వాళ్లను పరిచయం చేసుకుని మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు లాగి ఇలా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇలాంటి మాయలేడీపై పీడీ చట్టం నమోదు చేయలని డిమాండ్ చేశారు. -
2 కోట్లతో ఉడాయించిన మహిళ
హైదరాబాద్: హైదరాబాద్‌లొని జూబ్లిహిల్స్ యాదగిరి నగర్లో చిట్టీల పేరుతో వసూలు చేసిన డబ్బుతో ఓ మహిళ ఉడాయించింది. వివరాలు..యాదగిరి నగర్ లోని ఇరుగు పొరుగు, తెలిసిన వారి దగ్గర నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు ఓ మహిళ చిట్టిల పేరుతో వసూలు చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు కూడగట్టడంతో ఆమె అదును చూసి డబ్బుతో ఉడాయించింది. ఆమె దగ్గర చిట్టిలు వేసిన వారికి విషయం తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. -
పోలీస్ మాయగాడు!
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ప్రజలు మోసపోకుండా కాపాడాల్సిన ఓ పోలీసే మాయగాడి అవతారం ఎత్తి భార్యతో కలిసి మోసానికి పాల్పడ్డాడు. తోటి పోలీసులతో పాటు, ఇతర ప్రజలను చిట్టీలు, వడ్డీల పేరుతో మోసం చేసి రూ. 2.50 కోట్ల మేరకు టోపీ పెట్టాడు. ఈ తతంగం జరిగి ఏడాది గడుస్తున్నా బాధితులకు నామమాత్రంగానే చెల్లించి మిగతాది రేపు మాపంటే కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ముస్తఫానగర్‌కు చెందిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, తన భార్యతో కలసి తోటి వారిని, అదేవిధంగా ప్రజలను మోసంచేసి వారి వద్ద నుండి చిట్టీలు, వడ్డీ పేరుతో గత 2012 డిసెంబర్లో రూ. 2కోట్ల 50 లక్షలు సేకరించాడు. అప్పట్లో ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భార్యా భర్తలపై కేసు నమోదు అయింది. బాధితులు 40 మంది జిల్లా ఎస్పీని కలసి తమకు న్యాయం కోరారు. స్పందించిన అయన సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే తోటి పోలీసుకు రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా, రూ.4లక్షలు మాత్రమే చెల్లించి తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ హెడ్ కానిస్టేబుల్‌పై కేసు ఉన్నప్పటికి ఏడాది నుంచి విధులు నిర్వహిస్తూ దర్జాగా తిరుగుతున్నాడు. ఇప్పడు 610 జీఓ అడ్డం పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నలు చేస్తున్నాడు. అందులో భాగంగా అతనికి జిల్లాలో ఉన్న 20 ప్లాట్లను విక్రయించి పదోన్నతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరి బాధితుల్లో ఎక్కువ మంది పోలీసు కుటుంబాల వారే ఉన్నారు. తోటి పోలీసులను, ఇతరులను మోసం చేసి కూడా గత ఏడాదినుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. బాధితులు అందరికీ మొత్తం డబ్బులు చెల్లిస్తానని చెబుతూ గత ఏడాదినుంచి కేసును పెండింగ్‌లో ఉంచుతూ వస్తున్నాడు. జిల్లా కేంద్రంలో ఇలా చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన 10మందిలో నలుగురు పోలీసులే ఉండటం విశేషం. ఒక్కొక్కరు. రూ.50 లక్షల నుంచి కోట్లులోనే మోసం చేశారు. అయినప్పటికీ రికవరీ చేయడంలో పోలీసులు చొరవ చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. . పోలీసులే మోసం చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను వివరణ కోరగా డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాడుగా అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.