ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ప్రజలు మోసపోకుండా కాపాడాల్సిన ఓ పోలీసే మాయగాడి అవతారం ఎత్తి భార్యతో కలిసి మోసానికి పాల్పడ్డాడు. తోటి పోలీసులతో పాటు, ఇతర ప్రజలను చిట్టీలు, వడ్డీల పేరుతో మోసం చేసి రూ. 2.50 కోట్ల మేరకు టోపీ పెట్టాడు. ఈ తతంగం జరిగి ఏడాది గడుస్తున్నా బాధితులకు నామమాత్రంగానే చెల్లించి మిగతాది రేపు మాపంటే కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
ముస్తఫానగర్‌కు చెందిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, తన భార్యతో కలసి తోటి వారిని, అదేవిధంగా ప్రజలను మోసంచేసి వారి వద్ద నుండి చిట్టీలు, వడ్డీ పేరుతో గత 2012 డిసెంబర్‌లో రూ. 2కోట్ల 50 లక్షలు సేకరించాడు. అప్పట్లో ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భార్యా భర్తలపై కేసు నమోదు అయింది. బాధితులు 40 మంది జిల్లా ఎస్పీని కలసి తమకు న్యాయం కోరారు. స్పందించిన అయన సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే తోటి పోలీసుకు రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా, రూ.4లక్షలు మాత్రమే చెల్లించి తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ హెడ్ కానిస్టేబుల్‌పై కేసు ఉన్నప్పటికి ఏడాది నుంచి విధులు నిర్వహిస్తూ దర్జాగా తిరుగుతున్నాడు. ఇప్పడు 610 జీఓ అడ్డం పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నలు చేస్తున్నాడు. అందులో భాగంగా అతనికి జిల్లాలో ఉన్న 20 ప్లాట్లను విక్రయించి పదోన్నతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
వీరి బాధితుల్లో ఎక్కువ మంది పోలీసు కుటుంబాల వారే ఉన్నారు. తోటి పోలీసులను, ఇతరులను మోసం చేసి కూడా గత ఏడాదినుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. బాధితులు అందరికీ మొత్తం డబ్బులు చెల్లిస్తానని చెబుతూ గత ఏడాదినుంచి కేసును పెండింగ్‌లో ఉంచుతూ వస్తున్నాడు. జిల్లా కేంద్రంలో ఇలా చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన 10మందిలో నలుగురు పోలీసులే ఉండటం విశేషం. ఒక్కొక్కరు. రూ.50 లక్షల నుంచి కోట్లులోనే మోసం చేశారు. అయినప్పటికీ రికవరీ చేయడంలో పోలీసులు చొరవ చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. . పోలీసులే మోసం చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను వివరణ కోరగా డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాడుగా అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.
పోలీస్ మాయగాడు!
Published Fri, Jan 10 2014 3:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement