Chittoor Elections
-
టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి. తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి. -
వద్దు బాబూ..మీకో దండం!
సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్‌కు అంజనం వేసినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. సర్వేలో బహిర్గతమైన ఓటమి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు. కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మాజీ మంత్రికి ఓటమి భయం పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్ వైఎస్సార్సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్‌కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్నాథ్రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించేందుకు బాబు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు. చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. తిరుపతిలో పలాయనమే.. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్‌రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మెన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తున్నా, ఆయన గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్‌ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్‌ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
పతనావస్థ దిశగా ప్యాకేజ్ స్టార్ పరుగులు!
పేరుకు సొంత జిల్లా అయినా చంద్రబాబుకు ఏనాడూ ప్రజల మద్దతు దక్కలేదు.. పొత్తుల పేరుతో ఇతర పార్టీలతో కలిసి వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు.. అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని యత్నించినా ప్రయోజనం చేకూరలేదు.. మళ్లీ పాత కథే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచడం లేదు. అసలే బలమైన అభ్యర్థులు లేక ఆందోళన చెందుతున్న బాబుగారికి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఎలాగైనా విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలనే దురాలోచన చేస్తున్నట్లు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చివరకు టీడీపీ.. జనసేన నేతల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చివరకు టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారు. కీలకమైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. పొత్తులో భాగంగా పై మూడు స్థానాలను జనసేన కోరకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలిసిందే. తన నైజానికి తగ్గట్టు చంద్రబాబు ఆయా స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చినా, వీటిని వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా ఈ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులనే బరిలోకి దింపాలని టీడీపీ అంతర్గత సమావేశంలో నిర్ణయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. నేడో, రేపో చేరిక ఉండవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. జన బలమే కాదు.. పార్టీ కమిటీలకు దిక్కులేని జనసేన నాయకులమని చెప్పుకునే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా పైకి మాత్రం భాయ్భాయ్ అని కలరింగ్ ఇచ్చుకు తిరుగుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన జనసేన నేతలతో పరిచయ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై పసుపులేటికి షోకాజ్ నోటీసు ఇవ్వడం వెనుక కిరణ్ రాయల్ హస్తం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. మరికొందరికి సీటు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. భారంగా ‘రా కదలిరా’ అభ్యర్థుల విషయమే తేల్చకుండా.. చంద్రబాబు ‘రా కదలి రా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, పచ్చ పత్రిలు, ఎల్లో ఛానళ్లలో తప్ప టీడీపీ గురించి పట్టించుకోని జనంలో పార్టీకి హైప్ తెచ్చేందుకే ఎన్నికల ముందు ఈ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘రా కదలిరా’ను అట్టహాసంగా చేపట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తలకు మించిన భారంగానే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చేసేది లేక ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నుంచి తమ పార్టీలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని ప్రజలను నమ్మించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కంటికి కనిపించిన వారిని పట్టుకువచ్చి పచ్చ కండువా కప్పేస్తున్నారు. వారందరూ వైఎస్సార్సీపీ నుంచి వలస వచ్చేస్తున్నారని కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం కుప్పం మండలం మల్లనూరు సమీపంలోని టి.సదుమురు, హెచ్.కొట్టాల గ్రామాలకి చెందిన పలువురిని తీసుకెళ్లి టీడీపీ కండువాలు కప్పేసి ఫొటోలకు ఫోజులిప్పించేశారు. తమ్ముళ్ల అవస్థలు పసిగట్టిన ప్రజలు బాహాటంగానే నవ్వుకుంటుండడం కొసమెరుపు. చిత్తూరులో బాబు చిచ్చు చిత్తూరులో టీడీపీ జెండా మోసేవారు కరువైన సమయంలో మాజీ మేయర్ కఠారి హేమలత, మరి కొందరు టీడీపీ శ్రేణులు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిత్వం తమకే దక్కుతుందనుకున్న కఠారి హేమలత, బాలాజీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. కొత్తగా జగన్మోహన్ అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. కొంత కాలంగా జగన్మోహన్ చిత్తూరులోనే ఉంటూ ప్రజలకు రకరకాల బహుమతులు పంపిణీ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చిత్తూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జగన్మోహన్కు సైతం చంద్రబాబు హ్యాండిచ్చేశారు. తాజాగా డీకే ఆదికేశవులు నాయుడు బంధువులను రంగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. చాలా కాలంగా బెంగళూరుకే పరిమితమైన డీకే కుటుంబీకులు కొద్ది రోజులుగా చిత్తూరు, శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యకు జనసేన కండువా కప్పించారు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, టీడీపీ దివంగత నేత గురవయ్య నాయుడుకు ఈమె కోడలు. అందుకే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌రెడ్డి అభ్యర్థిగా పనికిరాడని స్థానిక టీడీపీ నేతలు కొందరు చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం. అవగాహన రాహిత్యం, అసభ్య పదజాలంతో సుధీర్‌రెడ్డి మాట్లాడిన మాటలు, ప్రవర్తనపై బాబుకు వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొజ్జల సుధీర్ అభ్యర్థిగా పనికి రాడనే అభిప్రాయానికి ఆ పార్టీ అధినేత వచ్చినట్లు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చిత్తూరు విషయానికి వస్తే.. డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబంలోని వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. తాజాగా మరో వ్యక్తికి ఫోన్‌చేసి టికెట్ ఆఫర్ చేసినట్లు తెలియడం గమనార్హం. -
కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. సీఎం జగన్ మా నాయకుడు. ఆయన కోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా మేము ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తాం. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం కాంగ్రెస్, టీడీపీ పార్టీలదే. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా.. ఎవరు చేరినా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. మేము వారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. జడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుకుంటున్నా అని కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం
తిరుపతి మంగళం (తిరుపతి జిల్లా): నిత్యం ప్రజాసంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌తో తనకు విభేదాలున్నా యంటూ ఎల్లో మీడియా అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో తనకు విభేదాలుంటే తాను ఇంకా పార్టీలోఉంటానా? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు ఉనికి కోల్పోయేలా చేస్తున్నానని తనకు, సీఎం జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించాలన్న కుట్రలతో ఎల్లో మీడియా కట్టుకథలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, సీఎం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. అంతేతప్ప సీఎంతో విభేదాలు పెట్టుకునే అవసరం, తత్వం తనది కాదని స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దురాలోచనతో ఎల్లో మీడియా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌కు పెద్దిరెడ్డిని దూరం చేస్తే చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో ఉనికి కోల్పోకుండా ఉండవచ్చన్న ఆలోచనతో ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతూ విషపురాతలు రాస్తోందన్నారు. టీడీపీ ఇప్పటికే పాడెపైకి చేరిందని, చివరిదశలో చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో పోరాడుతున్నాడని చెప్పారు. జగన్‌పై, తనపై, వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులపై ఎలాంటి కట్టుకథలు రాసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండేలా చేసిన కుప్పం ప్రజలకు ఏం చేశావు చంద్రబాబూ.. అని ప్రశి్నంచారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకానన్ని సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్రెడ్డినే తిరిగి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.