ఎమ్మెల్యే గారు మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా..
సాక్షి, చిత్తూరు: ‘‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతున్నా.. చిత్తూరులోని ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నాం. మీ శ్రేయోభిలాషి కావడంతో ముందుగానే చెబుతున్నా. కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న మాట, నేండ్రగుంట వద్ద మన టీమ్ (ఏసీబీ బృందం) భోజనాలు చేస్తోంది. ఓ రూ.8 వేలు పంపితే బాగుణ్ణు.’’ అంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్ చేసి, మస్కాకొట్టబోయిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఎమ్మెల్యే పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంగవరానికి చెందిన ఉప్పత్తి హరికృష్ణ (35)ను గురువారం అరెస్టు చేశారు. చిత్తూరు ఇన్చార్జ్ డీఎస్పీ తిప్పేస్వామి, టూటౌన్ సీఐ యుగంధర్, తాలూక సీఐ విక్రమ్ ఇతని నేరచరిత్రను మీడియాకు వివరించారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మదనపల్లెవారి ఇండ్లు సమీపంలోని సాయిగార్డెన్ సిటీకి చెందిన ఉప్పత్తి హరికృష్ణ.. ఇంటర్ వరకు చదువుకున్నాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నవాళ్లను మోసం చేయడంలో దిట్ట. ఓ సెల్‌ఫోన్ కంపెనీకు చెందిన టవర్ లొకేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులకు వలవేశాడు. నిరుద్యోగ అభ్యర్థులను తాను ముందుగా ఎంచుకున్న ప్రదేశాలకు పిలవడం, ఇంటర్వ్యూలు చేసేలా ఓ వాతావరణం సృష్టించేవాడు. ‘ఇంటర్వ్యూకు గడ్డం గీసుకోకుండా వస్తే ఎలాగయ్యా..? అదిగో అక్కడున్న షాపులో షేవ్ చేసుకుని, స్నానంచేసి రా’ అంటూ నిరుద్యోగులను పంపడం, వాళ్ల మొబైల్లో ఉన్న పేటీఎం, ఫోన్ పే కోడ్లు తెలుసుకుని తన బ్రాంచ్ ఆఫీసు నుంచి డబ్బులు వస్తాయని నిరుద్యోగుల నంబర్ల నుంచి పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసేవాడు. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు)
ఇలా అనంతపురం జిల్లాలోని పెనుగొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో తహసీల్దార్లు, పోలీసు అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేశాడు. ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకుని.. రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఫోన్‌పే, పేటీఎంలలో డబ్బులు వేయించుకునేవాడు. ఈనెల 4వ తేదీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్‌చేసి రూ.8వేలు అడగడంతో ఆయన పీఏ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వలపన్ని తొలుత రూ.200 ఫోన్‌పేలో పంపించి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హరికృష్ణను అరెస్టు చేశారు. (క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం)
పోలీసుల విచారణలో నిందితుడిపై తిరుపతి, పుంగనూరు, బైరెడ్డిపల్లె, మదనపల్లె, తంబళ్లపల్లె, బంగారుపాళ్యం పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇతను జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు గుర్తించారు. చిత్తూరులోని వన్‌టౌన్, టూటౌన్, తాలూక పోలీస్ స్టేషన్ల పరిధిలో వారంలో ముగ్గురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. చిత్తూరులో నమోదైన మూడు కేసుల్లో నిందితుడ్ని అరెస్టు చేస్తున్నట్లు, ఇతనిపై రౌడీషీట్ కూడా తెరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇతడ్ని పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐలు విక్రమ్, నాగసౌజన్య, సిబ్బంది రాజ్‌కుమార్, సుధాకర్‌ను డీఎస్పీ అభినందించారు.