తణుకు మాజీ ఎమ్మెల్యే బాపినీడు కన్నుమూత
తణుకు, న్యూస్‌లైన్: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు (77) ఆది వారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం గుండెపోటు రావటంతో కుటుంబసభ్యులు తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీచేసి విజయం సాధించారు.
ఆయన హయాంలో అజ్జరంపుంత కాలనీ లో పేదలకు ఇళ్లు నిర్మించటం ద్వారా పేదల మనిషిగా పేరొందారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు నరేంద్ర పారిశ్రామికవేత్త. బాపినీడు తండ్రి ఇంద్రయ్య స్వాతంత్ర సమరయోధుడు.
ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి తణుకు తొలి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు. కాగా బాపినీడు మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.