Chitveli
-
మామిడి తోటలో బాలుడి మృతదేహం
చిట్వేలి: అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని గొంతునులిమి హత్య చేసిన ఉదంతం చిట్వేలి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సిద్దారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అంకాలమ్మ ఎస్టీ కాలనీకి చెందిన జలకం వీరమ్మకు ఐదేళ్ల క్రితం సుబ్బరాయుడు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి శివ అనే నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో శివమ్మకు ఎందోటి పెంచలయ్య అనే వ్యక్తితో పరిచయమైంది. వీరిద్దరూ పది రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఈనెల 15న ఆదివారం శివను వెంట తీసుకుని సీఎం రాచపల్లి ఎగువ ఎస్టీ కాలనీలో ఉన్న బంధువు నగరిపాటి మణి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి సోమవారం బాలుడి తో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే వీరిద్దరు గ్రామానికి చేరుకోగా బాలుడు మాత్రం రాలేదు. సీఎంరాచపల్లికి చెందిన ఓ మామిడితోటలో బాలుడి మృతదేహం ఉన్నట్లు గ్రామసేవకుడు చంద్రయ్య మంగళవారం వీఆర్వో మోహన్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు వీఆర్వో మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు ఇన్చార్జి సీఐ అశోక్‌కుమార్, చిట్వేలి ఎస్ఐ డాక్టర్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తమకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో బాలుడిని గొంతు నులిమి హత్యచేసినట్లు స్పష్టమవుతోంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం
చిట్వేలి: సమాజంలో బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చిట్వేలి మండలం యన్.ఉప్పరపల్లెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక పోయినా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు నాయకులు గణాంకాలతో గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, నాయకులు చొప్పా వెంకటరెడ్డి, మహేష్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, చంగల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గౌసియా, నరసింహులు, కరిముల్లాఖాన్, బషీరుద్దీన్, వెంకటరమణ, లోకేష్, పద్మాకర్ పాల్గొన్నారు.