ఖాండ్వా టు జానకీపురం
* జైలు నుంచి తప్పించుకుంటూనే అబు ఫైజల్ ముఠా అరాచకం
* ఇద్దరు కానిస్టేబుళ్లను పొడిచిన వైనం
* ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో దోపిడీలు
* చొప్పదండి ఎస్బీఐలో దొంగతనం
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్ నేతృత్వంలో తప్పించుకున్న ముష్కరమూక దేశవ్యాప్తంగా ఎన్నో అరాచకాలకు పాల్పడింది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడింది. పలు చోట్ల బాంబు పేలుళ్లతోనూ వీరికి సంబంధమున్నట్లు అనుమానాలున్నాయి. అలాంటి ఈ ముఠాలో ఇద్దరు శనివారం నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో మరణించారు. మరో నలుగురు ఏపీలోకి అడుగుపెట్టినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలోని జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. నిషేధిత సిమి మధ్యప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పనిచేశాడు. డాక్టర్‌గా చెలామణీ అవుతూ... దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.
భోపాల్‌కు చెందిన ఒక బీఎస్పీ నేత, బీజేవైఎం నాయకుడిపై జరిగిన హత్యాయత్నాల కేసుల్లో అరెస్టయిన అబు ఫైజ ల్ను మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైల్లో ఉంచారు. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుళ్లు యాదవ్, సింగ్‌ల హత్యతో పాటు దోపిడీ, దొంగతనం కేసుల్లో అరెస్టయిన వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లాం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఇజాజుద్దీన్, అబిద్ మీర్జాలు కూడా ఆ సమయంలో ఖాండ్వా జైల్లోనే ఉన్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీరిని ఆకర్షించిన అబు ఫైజల్ ఒక ముఠాగా తయారుచేశాడు.
వరుసగా నేరాలు..
ఖాండ్వా జైల్లోంచి పారిపోయిన వారిలో మిగిలిన జకీర్ హుస్సేన్, మహ్మద్ అస్లాం, షేక్ మహబూబ్, అంజాద్, మహ్మద్ ఇజాజుద్దీన్లకు మరో వ్యక్తి తోడయినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. వీరంతా కలిసి ‘మాల్-ఇ-గనిమఠ్’ పేరుతో కొత్త మాడ్యుల్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్‌గా చేసుకుని.. గత ఏడాది ఫిబ్రవరి 1న పంజా విసిరారు. గత ఏడాది మే 1న చెన్నై రైల్వేస్టేషన్లో బెంగళూరు-గువహటి రైల్లో జరిగిన పేలుళ్లలో వీరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇక గతేడాది డిసెంబర్ 29న బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుడు కూడా వీరిపనిగానే అనుమానిస్తున్నారు.
ఖాండ్వా ఎస్కేప్..
ఈ ఏడుగురు ముష్కరులు 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సెల్ బాత్రూమ్ గోడల్ని పగలగొట్టుకుని బయటకు వచ్చారు. అడ్డుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పొడిచి వారి వద్ద ఉన్న తుపాకులు, వైర్లెస్ సెట్లను తీసుకుని పారిపోయారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే అబిద్ పోలీసులకు చిక్కాడు. తరవాత 2013 డిసెంబర్లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్ దొరికిపోయాడు. ఫైజల్‌ను విచారిస్తున్న సమయంలోనే... ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు భత్కల్ జైల్లోంచి పారిపోవడానికి స్కెచ్ వేసినట్లు బయపడింది.
‘ముత్తూట్’లో దోపిడీ వీరిపనే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో పటాన్చెరు సమీపంలోని బీరంగూడలో ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ చేసింది కూడా ఈ అబు ఫైజల్ ముఠాయేనని పోలీసులు అనుమానిస్తున్నారు. జానకీపురంలో హతమైన అస్లాంకు, ఈ దోపిడీలో పాల్గొన్న అజాజ్ ఊహాచిత్రంతో దగ్గరి పోలికలున్నట్టు తేలింది. మెదక్ జిల్లా పరిధిలోని బీరంగూడ లో ముత్తూట్ ఫైనాన్స్‌లో గత నెల 4న దోపిడీ జరిగింది. ఐదుగురు వ్యక్తులు దోపిడీకి తెగబడ్డారు. అజాజ్ అనే దుండగుడి ఊహచిత్రాన్ని రూపొందించారు. అది అస్లాం ఫొటోతో సరిపోలడం విశేషం!