కౌలురైతు ఆత్మహత్య
శుభకార్యం జరిగిన 13 రోజులకే విషాదం
పుల్కల్: అప్పుల బాధ భరించలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చౌటకూర్లో చోటుచేసుకుంది. ఈ నెల 21న తమ్ముడి వివాహం గణంగా జరిపిన అన్న.. పది రోజులకే ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. చౌటకూర్ గ్రామానికి చెందిన నేతి లక్ష్మణ్ (38) గతంలో హైదరాబాద్లో కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించే వారు.
మూడు సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వచ్చి కౌలుకు భూమిని తీసుకోని పంట సాగు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రెండు సంవత్సరాలుగా పత్తి పంటనే సాగు చేస్తున్నా పెట్టిన పెట్టుబడి రాక కౌలు పైకం సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆతని భార్య లక్ష్మీ తెలిపింది. పంట దిగుబడి లేక నష్టం వచ్చిందన్నారు.
ఎలాగైనా ఈసారి అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో మరోసారి పత్తి పంట వేశామన్నారు. కాని వర్షలు లేక పంట ఎండుముఖం పట్టడమే కాక, తెగులు సైతం సోకిందన్నారు. బుధవారం పత్తి పంటకు మందు కొట్టారన్నారు. శుక్రవారం సాయత్రం ఇంట్లోంచి తాడు తీసుకుని వెళుతుండగా.. తాను ఎక్కడికి అంటే వంట చెరుకు కోసం అని చెప్పి వెళ్లినట్లు భార్య లక్ష్మీ తెలిపింది.
రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో అతిని కోసం చుట్టు పక్కల వెతికినా అచూకి లభించలేదన్నారు. ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఉన్న మామిడిచెట్టుకు ఊరి వేసుకోని వేలాడుతుండగా చూసిన వారు తమకు సమాచారం ఇచ్చారని భార్య తెలిపింది.
10 రోజుల క్రితమే లక్ష్మణ్ తన తమ్ముడి మహిపాల్ పెళ్లి చేశారని తెలిపారు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం తమను ఎంతో ఆవేదనకు గురిచేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణæ తెలిపారు. మృతునికి 11 సంవత్సరాల కుమారుడు, 4 సంవత్సరాల కుమార్తె ఉంది.