Christian Bhavan building
-
త్వరలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం మాటల సెక్యూలరిస్ట్ కాదని, ఆచరణలో గుండెల నిండా లౌకికవాదాన్ని నింపుకున్నారన్నారు. మంత్రుల నివాస ప్రాం గణంలోని క్లబ్‌హౌజ్‌లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో మిషనరీల పాత్ర ఎవరూ కాదనలేరని, కరోనా పరిస్థితుల్లో మిషనరీ ఆసుపత్రుల సేవలు మరువలేనివని కేటీఆర్ ప్రశంసించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 8 వేల మందికి విద్యాబోధన: కొప్పుల రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 204 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 వేల మంది క్రైస్తవ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించడంతో పాటు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. వంద దేశాల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావసరమా? ఓ వర్గం కోసమా?
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం చేసిన భూ కేటాయిం పులపై హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి భూమి కేటాయింపు ప్రజావసరాల కిందకు వస్తుందా? లేదా సమాజంలో ఓ వర్గం ప్రయో జనాల కిందకు వస్తుందా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఒక వర్గం కోసమే భూమి కేటాయించినట్ల యితే మార్కెట్ ధర చెల్లించాకే దాన్ని స్వాధీ నం చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కేటాయించిన భూమిని తక్షణమే సదరు భూ యజమానికి అప్పగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం స్వల్పంగా సవ రించింది. భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నందున ఆ భూమిని అలాగే అట్టిపెట్టుకో వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, నిర్మాణా లకు అనుమతులు కూడా ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మధ్యంతర ఉత్తర్వులుగా భావించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఉత్తర్వులపై అభ్యంతరా లుంటే ఎత్తివేయాలని కోరుతూ సింగిల్ జడ్జి వద్ద అనుబంధ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు నని సూచించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు ప్రభుత్వం ఏదైనా అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తే.. సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌పై తమ వ్యాఖ్యల ప్రభావానికి లోను కాకుండా కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ జరిపి నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నోటీసులు ఇచ్చినా స్పందించలేదు అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామంలోని సర్వే నంబర్ 124/బీలోని మూడెకరాల భూమిని ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం కేటాయించింది. భూమిలో నిర్మాణ పనులను ప్రారంభించింది. క్రిస్టియన్ భవన్‌కు కేటాయించిన భూమి తమదని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకుందని, తమ భూమిని తమకిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎం.గంగావతి, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు పట్టాను రద్దు చేయకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. తక్షణమే మూడెకరాల భూమిని పిటిషనర్లకు స్వాధీనం చేయా లని అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, మల్కాజ్గిరి– మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచనామా నిర్వహించిన తర్వాతే 2016లో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. భూమి స్వాధీనానికి ముందే నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నామన్నారు. అయితే నోటీసులకు పిటిషనర్లు స్పందిం చకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆ భూమి ఒకవేళ పిటిషనర్లదేనని తేలితే, వారికి పరిహారం చెల్లించడమో లేక ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడమో చేస్తామని తెలిపారు. -
మహేంద్ర హిల్స్‌లో క్రైస్తవభవన్
స్థలం గుర్తించిన అధికార యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రైస్తవభవన్ నిర్మాణం కోసం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖ మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని సేకరించింది. క్రైస్తవుల ప్రగతి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో క్రైస్తవభవన్ నిర్మిస్తామని ప్రకటించటంతో పాటు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.10 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం మారేడ్‌పల్లి మండలం మల్కాజిగిరి ప్రాంతంలోని మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు.