christina grimmie
-
సింగర్ హత్యపై సెలబ్రిటీల దిగ్భ్రాంతి
ఫ్లోరిడా: ప్రముఖ సింగర్, 'ది వాయిస్' స్టార్ క్రిస్టినా గ్రిమ్మీ(22) మరణంపై హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్లేక్ షెల్టన్, ఆడమ్ లివైన్, సెలెనా గోమెజ్, డెమీ లొటావొ తదితర సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో శుక్రవారం 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ప్రేక్షకులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో కెవిన్ జేమ్స్ అనే వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపాడు. తర్వాత అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రిస్టినా మరణం తననెంతో కలిచివేసిందని గోమెజ్ తెలిపింది. ఆమెను ఎందుకు హత్య చేశారో తెలియదని వెల్లడించింది. క్రిస్టినాకు కన్నీటితో నివాళి అర్పించింది. తన పాటల్లో ఒకటి ఆమెకు అంకితం చేసింది. క్రిస్టినా హత్య గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, గుండె పగిలినంతపనైందని బ్లేక్ షెల్టన్ ట్వీట్ చేశాడు. క్రిస్టినా కుటుంబానికి సానుభూతి తెలిపింది. క్రిస్టినా మృతి వార్త వినగానే తన హృదయం గాయపడిందని, ఆమెను హత్య చేయడం దారుణమని లొటావొ ట్వీట్ చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించింది. క్రిస్టినా, ఆమె కుటుంబ సభ్యుల కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు నిక్ జొనాస్ ట్విటర్ లో పేర్కొన్నాడు. క్రిస్టినా హత్యకు గురికావడం తనను షాక్ కు గురి చేసిందని, తానెంతో ఇష్టపడే ఆమె మరణం కలచివేసిందని ఆడమ్ లివైన్ ట్వీట్ చేశాడు. తనకు మాటలు రావడం లేదని, క్రిస్టినా ఆత్మకు చేకూరాలని సింగర్ టొరీ కెల్లీ కోరుకుంది. సింగర్ చెర్ లయెడ్, మోడల్ హెయిలీ బాల్డ్విన్ తదితరులు కూడా క్రిస్టినా మరణం పట్ల సంతాపం తెలిపారు. -
పిచ్చి అభిమానంతోనే చంపేశాడా!
ఫ్లోరిడా: గాయని క్రిస్టినా గ్రిమ్మీ(22)పై కాల్పులకు పాల్పడిన హంతకుడిని పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఆర్లాండోలో తన బ్యాండ్ ప్రదర్శన ముగిసిన అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా జరిపిన కాల్పుల్లో గ్రిమ్మీ మృతి చెందిన విషయం తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన కెవిన్ జేమ్స్(27)గా గుర్తించారు. కేవలం గ్రిమ్మీని చంపే ఉద్దేశంతోనే అతడు ఆమె ప్రదర్శన నిర్వహిస్తున్న చోటుకు వచ్చాడని పోలీసులు నిర్థారించారు. గ్రిమ్మీపై కాల్పులు జరిపిన అనంతరం కెవిన్ జేమ్స్ కూడా తనకు తాను కాల్చకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గ్రిమ్మీ సోదరుడు మార్క్ గ్రిమ్మీ కాల్పులకు పాల్పడిన కెవిన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడని.. అయితే ఆ క్రమంలోనే కెవిన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. హంతకుడు కెవిన్ ఇంటి దగ్గర ఓ లేఖను గుర్తించారు. దానిలో గ్రిమ్మీని టాలెంటెడ్, లవింగ్ సింగర్‌గా పేర్కొన్న కెవిన్.. ఆమె కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. లేఖను బట్టి చూస్తే గ్రిమ్మీని చంపాలని ముందుగానే కెవిన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. గ్రిమ్మీకి కెవిన్ వీర ఫ్యాన్ అని తెలుస్తోంది. -
ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్‌పై కాల్పులు
ఆర్లాండో: అమెరికాలోని ఆర్లాండోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్, 'ది వాయిస్' స్టార్ క్రిస్టినా గ్రిమ్మీపై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గ్రిమ్మీ అక్కడికక్కడే మృతి చెందారని ఆర్లాండో పోలీసులు వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆర్లాండోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె బ్యాండ్ 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ప్రేక్షకులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 60 మంది వరకు పాల్గొన్న కార్యక్రమంలో గ్రిమ్మీని లక్ష్యంగా చేసుకొనే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి గ్రిమ్మీకి తెలిసిన వ్యక్తేనా లేక సోషల్ మీడియాలో ఆమెను అభిమానించే క్రేజీ ఫాలోవరా అనే విషయం దృవీకరించాల్సి ఉందని ఆర్లాండో పోలీసు అధికారి వాండా మిగ్లియో తెలిపారు.