breaking news
Chrysanthemum
-
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
Chrysanthemum: ఎల్ఇడీ బల్బుల వెలుగులో చామంతి పూల సాగు!
మార్కెట్లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్సీజన్లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్సీజన్లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సాధారణంగా జూన్–జూలై నుంచి చామతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే, రైతులందరూ ఈ సీజన్లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శవికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల వెలుగు.. శశికళాధరప్ప(31) ఎంసీఏ పూర్తి చేసి 2020–21లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. రూ.20 వేలు ఖర్చు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్ఇడీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూట మాదిరిగా వెలుతురు పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్ సీజన్లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు. ప్లాస్టిక్ షీట్లతో కృత్రిమ చీకట్లు.. శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూ మొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చేందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి/ చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా–1, పార్ములా–2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కకోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్సీజన్లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ.2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) రూ. 2 లక్షల నికరాదాయం ఆశిస్తున్నా! మాకు గ్రామం ప్రక్కనే 8.50 ఎకరాల సారవంతమైన భూమితోపాటు బోరు ఉంది. ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలతో అన్సీజన్లో చామంతి పూల సాగు చేపట్టాను. అనువుకాని కాలంలో పూల సాగు చేపట్టి కృత్రిమ కాంతి, కృత్రిమ చీకటి కల్పించడం వల్ల పూల సాగు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి రూ.90 వేలు అవుతోంది. రూ.2 లక్షల వరకు నికరాదాయం వస్తుందనుకుంటున్నా. – మంచిరెడ్డి శశికళాధరప్ప, రామళ్లకోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా (99669 98816, 91823 27249) ఇక్కడ చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
చైనా చేమంతికి గిన్నిస్ రికార్డ్!
ఆకట్టుకునే రేకుల దొంతరలు.. ఆమడ దూరానికి వెదజల్లే పరిమళాలు... కనువిందైన రంగు రంగుల చేమంతి పూల అందాలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. చైనా హెనాన్ ప్రావిన్స్ లో అంటుకట్టిన మొక్కకు విరిసిన పూలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒకే మొక్కకు అనేక రకాల్లో పూచిన పుష్పాలు గిన్నిస్ పుటలకెక్కాయి. చేమంతిలో ఎన్నో రకాలు, రంగులు చూసి ఉంటారు. కానీ అనేక రకాల పుష్పాలు ఒకే మొక్కకు పూయడం చూశారా? చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో అదే జరిగింది. 3.8 మీటర్ల వ్యాసంలో ఉన్న మొక్క 641 రకాల పూలు పూసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మొక్క వేసిన తర్వాత పెరిగి పూతకు వచ్చేందుకు నాలుగేళ్ళ సమయం పట్టింది. ఇప్పుడు ఈ మొక్కకు ఒకేసారి సుమారు 15 వందల పుష్పాలు ఒకేసారి పూయడమే కాక, వాటిలో 641 రకాలు కూడా ఉండటం రికార్డు నెలకొల్పింది.