చైనా చేమంతికి గిన్నిస్ రికార్డ్!
ఆకట్టుకునే రేకుల దొంతరలు.. ఆమడ దూరానికి వెదజల్లే పరిమళాలు... కనువిందైన రంగు రంగుల చేమంతి పూల అందాలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. చైనా హెనాన్ ప్రావిన్స్ లో అంటుకట్టిన మొక్కకు విరిసిన పూలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒకే మొక్కకు అనేక రకాల్లో పూచిన పుష్పాలు గిన్నిస్ పుటలకెక్కాయి.
చేమంతిలో ఎన్నో రకాలు, రంగులు చూసి ఉంటారు. కానీ అనేక రకాల పుష్పాలు ఒకే మొక్కకు పూయడం చూశారా? చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో అదే జరిగింది. 3.8 మీటర్ల వ్యాసంలో ఉన్న మొక్క 641 రకాల పూలు పూసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మొక్క వేసిన తర్వాత పెరిగి పూతకు వచ్చేందుకు నాలుగేళ్ళ సమయం పట్టింది. ఇప్పుడు ఈ మొక్కకు ఒకేసారి సుమారు 15 వందల పుష్పాలు ఒకేసారి పూయడమే కాక, వాటిలో 641 రకాలు కూడా ఉండటం రికార్డు నెలకొల్పింది.