దర్శకుడిని కాకపోతే రైతు అయ్యేవాడిని..
- దర్శకుడు వీరభద్రం
ఏలూరు : తాను డైరెక్టర్ కాకపోతే రైతు అయ్యేవాడినని అన్నారు సినీ దర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు రైల్వేస్టేషన్ సమీపంలో 'చుట్టాలబ్బాయి' సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను అందించడమే తన లక్ష్యమన్నారు. చుట్టాలబ్బాయి చిత్రం యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిందని, ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. మే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
గతంలో తాను తీసిన అహనా పెళ్లంట, పూలరంగడు, భాయ్ చిత్రాలకు భిన్నంగా దీనిని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథా చిత్రంగా నిర్మిస్తున్నామన్నారు. తనది చాగల్లు మండలం కలవలపల్లి అని బీకాం చదివానని చెప్పారు. ఇవీవీ సత్యనారాయణ, తేజ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశానని చెప్పారు. అహనా పెళ్లంటతో దర్శకుడిగా అవకాశం వచ్చిందని, పూలరంగడు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పారు.
గోదావరి ప్రాంత యాస, గ్రామీణ వాతవరణంతో తీసిన చిత్రాలు విజయం సాధిస్తున్నాయని తెలిపారు. హీరో రామ్, నాని, రవితేజతో సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానన్నారు. షార్ట్‌ఫిల్మ్, నటనలో నైపుణ్యం పెంచుకుంటే చిత్రసీమలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. గుర్తింపు పొందాలంటే మాత్రం అదృష్టం కూడా ఉండాలని వీరభద్రం అన్నారు.
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
చుట్టాలబ్బాయి సినిమా షూటింగ్లో భాగంగా శుక్రవారం హీరో ఆది, హీరోయిన్ నమితా ప్రమోద్, ప్రతినాయకుడు చరణ్‌దీప్ మధ్య యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు వీరభ్రం చిత్రీకరించారు. హీరోయిన్ నడిచి వెళుతుండగా ఆమెను విలన్ గ్యాంగ్ వెంబడించగా హీరో రక్షించే సన్నివేశాలు, ఫైట్‌ను తెరకెక్కించారు. ఈ నెల 20 వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. సాయికుమార్, రఘుబాబు, పృద్వీ, జీవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారని చెప్పారు.