పీజీ మెడికల్ స్కాం జరిగిందిలా..
పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కాం గుట్టు మొత్తం బయటపడింది. మొదటి 30 ర్యాంకులు సాధించినవారిలోనే 10 మంది ఇలా అక్రమ మార్గంలో ర్యాంకులు పొందారు. దీనికి సబంధించి కీలక పాత్రధారులందరినీ సీఐడీ విభాగం అరెస్టు చేసింది. ఇద్దరు నిపుణులైన వైద్యులు దగ్గరుండి మొత్తం సమాధానాలు రూపొందించి, ముందుగా బేరాలు కుదుర్చుకున్న అభ్యర్థులకు వాటిని అందించి వాళ్లకు ర్యాంకులు రప్పించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్.. ఈ వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించారు. అవి ఇలా ఉన్నాయి... మొత్తం స్కాముకు పునాది మణిపాల్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో పడింది. అక్కడ ప్రవీణ్ అనే వ్యక్తి రహస్యంగా ప్రెస్‌లోకి ప్రవేశించి, పేపర్ దొంగిలించి అమీర్ అహ్మద్ చేతికి ఇచ్చాడు. అక్కడినుంచి అది అనుజ్ కుమార్ సింగ్, సురేష్ అనే ఇద్దరు బ్రోకర్ల చేతికి వచ్చింది. వీళ్లిద్దరూ కాక మరో ఇద్దరు ప్రధానమైన బ్రోకర్లు కూడా ఉన్నారు.
ఇలా సంపాదించిన ప్రశ్నపత్రాలకు సమాధానాలను డాక్టర్ అవినాష్, కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన డాక్టర్ ఫణీంద్ర అనే ఇద్దరితో రాయించారు. వీళ్లలో డాక్టర్ ఫణీంద్ర ముందుగా తన భార్య కోసం ఈ స్కాంలో ప్రవేశించి, తర్వాత అందరికీ రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్ అవినాష్ ట్యూటర్‌గా కూడా పనిచేసినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. వీళ్లిద్దరూ కలిసి 'కీ' సిద్ధం చేసి తాము బేరం కుదుర్చుకున్న అభ్యర్థులకు ఇవ్వడంతో వాళ్లు ఈ సమాధానాలను యథాతథంగా రాసి పీజీ మెడికల్ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సంపాదించారు. ప్రవేశపరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన ఆకుల శ్రీకాంత్, మూడో ర్యాంకర్, 29వ ర్యాంకర్ గౌతమ్ వర్మ, 95వ ర్యాంకర్ వినీల తదితరులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కొన్నిచోట్ల వాళ్ల తల్లిదండ్రులు కూడా స్కాంలో ఉన్నారని, బ్రోకర్లకు చెక్కులు ఇవ్వడం, సర్టిఫికెట్లను సెక్యూరిటీగా ఇవ్వడం లాంటివి చేశారని కృష్ణప్రసాద్ తెలిపారు. అందరినీ అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అన్నారు. ఇంకా ఎందరు బ్రోకర్లున్నారో.. ఎందరు విద్యార్థులను వలలో వేసుకున్నారో నిర్ధారించాల్సి ఉందని ఆయన చెప్పారు.