సమస్యల్లో టీబీడ్యాం ప్రాజెక్ట్ ఆస్పత్రి
హొస్పేట : టీబీడ్యాం తుంగభద్ర ప్రాజెక్ట్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి పీఎల్సీ, హెచ్‌ఈఎస్, వంగాయ క్యాంప్, నిశానిక్యాంప్, మారుతినగర్ తదితర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. సాధారణ జబ్బులకు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, చికున్‌గునియా తదితర విష జ్వరాలకు అవసరమైన మందులు లేవు. ఆ లక్షణాలతో వచ్చే రోగులకు ఆస్పత్రిలో రక్ష పరీక్ష చేయించుకోవడానికి సరైన కిట్లు కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతం ఆస్పత్రిలో 20 పడకలు ఉన్నా ప్రయోజనం లేదు.
వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఒకే వైద్యుడు ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే రోగులను నగర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. వారికి తగిన సమయానికి వైద్యం అందక మృత్యువాతపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్పత్రిలో మహిళా వైద్యురాలు లేరు. మహిళలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గర్భిణులు నగరంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్స్‌రే, ల్యాబ్‌టెక్నీషియన్ సిబ్బంది లేక ల్యాబ్‌కు తాళం వేశారు.
ఆస్పత్రిలో అంబులెన్స్ ఉన్నా పర్మినెంట్ డ్రైవర్ లేకపోవడంతో ఎమర్జెన్సీ రోగులకు ఉపయోగపడడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు సేవలు అందిస్తున్నారు. తుంగభద్ర మండలి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని విధాలా వైద్య సేవలు అందించేందుకు సౌకర్యాలు కల్పించాలని, ఆస్పత్రికి మహిళా వైద్యురాలు, ఫిజీషియన్, సర్జన్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.