గో..గో.. తూ.గో.
- ముంపు గ్రామాల విలీనంతో భారీగా విస్తరించనున్న జిల్లా
- ఏజెన్సీ వైపు మరో 80 కి.మీ. ముందుకు జరగనున్న సరిహద్దు
- అటు ‘పశ్చిమ గోదావరి’తోనూ మారనున్న పొలిమేరలు
సాక్షి, రాజమండ్రి : ‘ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగమొకటేనన్నా..’ తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి (సినారే) కలం నుంచి జాలువారిన తేనెమూటల్లాంటి సినిమా పాటల్లో ఒకానొక గీతంలోని పంక్తి ఇది. ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది’ అన్న ఆ పాటలో ఆయన ఆకాంక్షించింది తెలుగువారు ఎన్నటికీ ఒకటిగానే ఉండాలని. కారణాలు ఏవైనా..మూడుసీమల ముప్పేట వంటి రాష్ట్రం రెండు ముక్కలవుతోంది. సినారే పాట బాటలోనే.. ‘రాష్ట్రాలు వేరైనా.. మన రాగబంధం ఒకటేనన్నా’ అని రెండు ప్రాంతాల ప్రజలూ అనుకోగలిగినా సాంకేతికంగా విభజనరేఖలు తప్పవు.
నిన్నటి వరకు ‘మన గడ్డ’ అన్న భావనతో స్వేచ్ఛగా తిరిగిన చోటే ఆంక్షలను చ వి చూడకతప్పదు. భద్రాద్రిలో కొలువైన కోదండరాముడు.. మనకు రేపు కూడా అంతే దూరంలో ఉంటా డు. అయితే.. ఆ రఘురాముడిని దర్శించుకోవడానికి ‘రాష్ట్ర సరిహద్దు’ను దాటి వెళ్లక తప్పదు. రాష్ట్ర విభజనతో తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల మధ్యను న్న ఏజెన్సీ ప్రాంతం అంతర్ రాష్ట్ర సరిహద్దుగా మారి పోతోంది. ముంపు గ్రామాల విలీనం అనంతరం కొత్త సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ రెండు సమీపిస్తున్నా ఇంకా ఆ కసరత్తు పూర్తికాలేదు.
మారేడుమిల్లి నుంచి మరీ ముందుకు..
రాజమండ్రికి 80, కాకినాడకు 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి జిల్లాలో చివరి మం డలం. మారేడుమిల్లి తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని తులసిపాకలతో ఖమ్మం జిల్లా చింతూరు మం డలం మొదలవుతుంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోని (తులసిపాకలకు 10 కి.మీ. దూ రం) లక్కవరం సెంటర్ వద్ద వై.రామవరం మండ లం డొంకరాయి, మంగంపాడులతో పాటు, విశాఖ జిల్లా సీలేరు ప్రాంతాలకు వెళ్లే క్రాస్ రోడ్డు ఉంటుంది. అసలు గ్రామాలు ఉండని ఈ తావు వరకూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లా వాసులే ఎక్కువగా సంచరిస్తుంటారు.
ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చింతూరు, కూనవరం, వర రామచంద్రపురంలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు ఆర్డినెన్స్ వచ్చింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా భద్రాచలం మండలాన్ని కూడా తూర్పుగోదారిలో కలిపేస్తున్నందున పాత సరిహద్దులు చెరిగిపోనున్నాయి. మన జిల్లా సరిహద్దులు విస్తరించనున్నాయి. ఇకపై భద్రాచలానికి ముందు తగిలే సీతారాంపురం వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిధి ఉంటుంది.
మారేడుమిల్లి నుంచి భద్రాచలం 117 కిలోమీటర్లు. ప్రస్తుతం మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముగిసిపోయే మన జిల్లా సరిహద్దు భద్రాచలానికి సుమారు ఏడు కిలోమీటర్ల ముందు వరకూ.. మారేడుమిల్లికి 110 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించనుంది. అంటే ఈవైపు మన జిల్లా అదనంగా మరో 80 కిలోమీటర్ల వరకూ విస్తరించనుందన్న మాట. అలాగే ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం కానున్నందున ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కూడా విస్తరించనుంది.
అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు ఎక్కడో?
ముంపు గ్రామాల విలీ నంపై ఆర్డినెన్స్ ఆమోదం పొందక ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు దాటాక వచ్చే తులసిపాకలగా భావించారు. పాలనా సౌలభ్యం, భద్రతల రీత్యా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును మారేడుమిల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇది మన రాష్ట్రం తరపున తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు కలిపి ఉమ్మడి చెక్‌పోస్టు కాగలదు. కానీ కొత్త సరిహద్దుల ప్రకారం మన రాష్ట్ర చెక్‌పోస్టు చింతూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని చట్టి సెంటర్ వద్ద ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లకు ఉమ్మడిగా ఏర్పాటు చేయాలి.
లేదంటే భద్రాచలం సమీపంలోని సీతారాంపురం, గూడాల, కానాపురం గ్రామ శివార్లలో ఏదో ఒక అనువైన ప్రాంతం ఎంచుకుని తనిఖీ కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రకారం విలీన గ్రామాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుది సరిహద్దులు ప్రకటించాల్సి ఉంది. జూన్ రెండున తెలంగాణ అపాయింటెడ్ డే కన్నా ముందే ఈ సరిహద్దులపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అందరిలోనూ ఏమవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.