పశువులుగాసి డాక్టర్నయ్యా
కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమే
నిస్వార్థంగా వైద్యసేవలందించినప్పుడే గుర్తింపు
డిప్యూటీ సీఎం రాజయ్య
సంగారెడ్డి రూరల్: ‘‘దేన్ని సాధించాలన్నా ముందుగా లక్ష్యం ఏర్పచుకోవాలి..దాని సాధనకు కష్టపడాలి..నన్నే తీసుకోండి పశువులు కాపరి నుంచి పిల్లల వైద్యునిగా ఎదిగా’’ అంటూ డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య వైద్య విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని ఎంఎన్ఆర్ దంతవైద్య కళాశాల 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికిడిప్యూటీ సీఎం రాజయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదల, లక్ష్యంతో చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. విద్యనే జీవిత లక్ష్యంగా భావించిన ఎంఎన్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎంఎన్ రాజు విద్యారంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. 40 ఏళ్లక్రితం రూ.170తో పాఠశాలతో ప్రారంభించిన ఎంఎన్ రాజు ప్రస్తుతం 43 విద్యాసంస్థలు నెలకొల్పడంతో పాటు 2,000 మందికి ఉపాధి కల్పించి వేలాది మంది విద్యార్థులకు వైద్య, విద్య రంగంలో సేవలందిస్తున్నారన్నారు.
కృషిచేస్తే మనిషి ఏదైనా సాధించగలడన్న దానికి ఎంఎన్ రాజు జీవితమే నిదర్శనమన్నారు. ఇపుడు విద్యార్థులుగా ఉన్న వారు రేపు వైద్యులుగా సమాజంలోకి వెళ్లాక నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అప్పుడే గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తన గురువైన ఈశ్వరయ్యచారిని ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తనతో పాటు పీజీ చదివిన పలువురు స్నేహితులు ఎంఎన్ఆర్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎంఎన్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎంఎన్ రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తాము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు. అనంతరం ఎంఎన్ఆర్ విద్యసంస్థల వైస్ చైర్మన్ రవివర్మ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజును ఘనంగా సన్మానించారు.
అలరించిన ఆటపాటలు
వార్షికోత్సవంలోవిద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తమ ఆటపాటలతో విద్యార్థులు అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఎంఎన్ఆర్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ సుజాత గోపాల్, ఏఓ చలపతిరావు, పీఆర్ఓ ప్రసాద్, వైద్య కళాశాల సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.