హద్దు మీరొద్దు
=గంటాపై ధ్వజమెత్తిన బాలరాజు
=పరిధి దాటి మాటాడొద్దని స్పష్టీకరణ
=ఎవరి పని వారే చేయాలని హితవు
=లేదంటే తీవ్రపరిణామాలని హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: సీఎంపై ధ్వజమెత్తిన మంత్రి బాలరాజు ఇప్పుడు విమర్శల ను జిల్లాకు చెందిన మరో మంత్రి గం టా శ్రీనివాసరావు వైపు మరల్చారు. గంటా పరిధి దాటి, అన్నీ తానై అనుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు సం బంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని విమర్శించారు. ‘ఆయన వైఖరి చూస్తుంటే నాకు ఓ కథ గుర్తుకొస్తుంది. ఎవరు చేసే పని వారు చేయాలి. ఇంకొకరి పనిచేస్తే ఫలితమేంటో అందరికీ తెలిసిందే’ అని అన్యాపదేశంగా గంటాకు చురకలు అందించారు.
అవే పరిణామాలు గంటాకు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని బాలరాజుకు అందించారని, అందులో అధికారులు, సీఎం కార్యాలయ వర్గాల తప్పేం లేదని, మంత్రి బాలరాజు అలా చెప్పడం సరికాదని మంగళవారం జిల్లాకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై బాలరాజు ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన బుధవారం కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సర్క్యూట్ హౌస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంటాపై ఘాటుగా స్పందించారు.
సీఎం పర్యటన వ్యవహారం తనకు, సీఎం పేషీకి సంబంధించిన వ్యవహారమని,మధ్యలో జోక్యం చేసుకోవడానికి గంటా ఎవరని ప్రశ్నించారు. అసలేం జరిగిందో చెప్పాల్సిన ఉద్యోగం నీది కాదని స్పష్టం చేశారు. అలా మాట్లాడమని ముఖ్యమంత్రి చెప్పారా? లేదంటే నీకు నువ్వే చెప్పావా? దీనిని తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. ‘అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో ఆధారాలున్నాయి.
తప్పు ఒప్పులు నిర్ణయించడానికి ,సమాచారం నాకు అందిందని చెప్పడానికి గంటా ఎవరు’ అని బాలరాజు ప్రశ్నించారు. ఎవరినో భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించాలనుకోవడం తగదన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా గంటా మాట్లాడటం తగదన్నారు. గంటాతో కూడా తనకు విభేదాలు లేవని ముక్తాయింపు ఇచ్చారు. తన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.