చెరువు పూడ్చేస్తా - ఎన్నికల్లో గెలుస్తా!
'ఏ గతీ లేకపోతే నీ గతి గంగావతే' అని ఒక సామెత ఉంది. ఎన్నికల్లో పదేపదే ఓడిపోతూంటే ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? ఫార్ములాలన్నీ పటాపంచలైపోతూంటే, లెక్కలన్నీ ముక్కలైపోతూంటే ఎంతటి వాడైనా వాస్తు, జ్యోతిష్యాన్ని ఆశ్రయించాల్సిందే. అలాంటి గతే పట్టింది మన లాలూ ప్రసాద్ యాదవ్ కి.
ఒకప్పుడు బీహార్ ను ఏకఛ్చత్రంగా ఏలిన లాలూ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. పన్నెండు మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ మంత్రులు పార్టీకి రాం రాం చెప్పారు. కాంగ్రెస్ తో ఎన్నికల ఒప్పందం ఇంకా ఖాయం కాలేదు. రకరకాల కేసులు మరోవైపు చీకాకు పెడుతున్నాయి. వీటన్నిటినీ తట్టుకునేందుకు లాలూ ఏం చేస్తున్నారు?
ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా తన ఇంట్లో ఉన్న ఓ చెరువును కప్పిపెట్టించేస్తున్నారు లాలూ. 2006 లో పాట్నా యాన్ మార్గ్ అధికార భవనం నుంచి లాలూ దంపతులు సర్కులర్ రోడ్ లో ఉన్న భవనానికి వచ్చారు. అప్పుడు ఛత్ పూజ కోసం ఆయన నివాసభవనంలోనే ఒక భారీ చెరువు తవ్వించారు. అప్పట్నుంచే ఆయనకు సమస్యలు మొదలయ్యాయట. దాంతో ఇప్పుడు ఆ చెరువును పూడ్చేసే పని మొదలుపెట్టారాయన.
1990 లో తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు లాలూ వ్యవహార శైలి చాలా విప్లవాత్మకంగా ఉండేది. బాబాలు, తాయెత్తులంటే చాలు భగ్గుమనేవారు. పూజలు పునస్కారాలంటే మండిపడేవారు. ఇప్పుడు మాత్రం ఆయన బాబా పేరు చెబితే చాలు వెళ్లి పాదాలమీద పడిపోతున్నారు.
లాలూ ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ మీర్జాపుర్ లోని పగ్లా బాబా (పిచ్చి బాబా) ను సందర్శించి, సాగిలపడి వచ్చారు. అంతే కాదు... ప్రస్తుతం ఆయన ఇంట్లో టికెట్లు అడిగేవారికన్నా జాతకాలు చూసి, తంత్ర యంత్ర మంత్రాలు చేసే జ్యోతిష్కులు, తావీజు బాబాల సంఖ్యే ఎక్కువగా ఉందంటున్నారు. వాళ్లేం చెబితే అది చేస్తున్నారట లాలూ ప్రసాద్, రబ్రీ దేవి దంపతులు.