వాహనదారులకు షాక్.. 80 శాతం పెరగనున్న పీయూసీ సర్టిఫికేట్ చార్జీలు
భారతదేశంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న తరుణంలో రవాణా శాఖ 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (పియుసి) సర్టిఫికేట్ల కోసం చార్జీలను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచనున్నట్లు, దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. 2011 నుంచి PUC చార్జీలు పెంచలేదని.. రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు.
కొత్త రేట్లు అమల్లోకి వస్తే ధరలు మునుపటి కంటే దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు రవాణా మంత్రి 'కైలాష్ గహ్లోట్' తెలిపారు. కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది.
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం, ప్రతి వాహనం నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పీయూసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీలో PUC ప్రూఫ్ పీజు ద్విచక్ర వాహనాలకు రూ.60, పెట్రోల్ ఫోర్ వీలర్ల కోసం రూ. 80, డీజిల్ ఫోర్ వీలర్స్ కోసం రూ. 100. ఈ రేటుపైన 18 శాతం GST కూడా వసూలు చేస్తారు.
ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక..
PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో సుమారు 85 శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 27.8 లక్షల కార్లకు, 69.8 లక్షల టూ వీలర్లకు పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంబంధిత శాఖ ఇలాంటి వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.