జరిగిందేదో జరిగిపోయింది.. : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్ర దాడులకు బాధిత దేశంగా కొనసాగే ఓపిక ఇక భారత్‌కు లేదని ఆయన తేల్చిచెప్పారు. పుల్వామా, ఉరి ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ ‘జరిగిందేదో జరిగిపోయింది..ఇక శాశ్వతంగా ఉగ్రదాడులకు బలయ్యే పరిస్థితిలో తాము లే’మని ఘజియాబాద్‌లో ఆదివారం కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్ధాపక దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని పేర్కొన్నారు.
దేశంలో అస్థిరత సృష్టించాలనే పొరుగు దేశాల ఉగ్ర కుట్రలను సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయని కితాబిచ్చారు. యుద్ధంలో గెలిచే సామర్ధ్యం లేని పొరుగు దేశం భారత్‌లో అస్థిర వాతావరణ నెలకొనేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న క్రమంలో దేశ భద్రత, వ్యవస్థలను కాపాడుకోవడం సవాల్‌గా మారిందన్నారు. దేశంలో వేళ్లూనుకున్న వీఐపీ సంస్కృతి కొన్నిసార్లు దేశం భద్రతా వ్యవస్థలకు అవరోధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్ధిష్ట నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ దిశగా కొన్ని కఠిన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని ప్రధాని పేర్కొన్నారు.