సీఎంపై ఒత్తిడి తెద్దాం
- కోటా మేరకు నీటి కోసం అవసరమైతే ప్రధానిని కలవాలని నిర్ణయం
- వాడివేడిగా సాగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానం
- పీబీసీకి ఏటా అన్యాయమేనని వైఎస్ఆర్ జిల్లా ప్రజాప్రతినిధుల ఆవేదన
- చిత్రావతి డ్యాం పగులగొడితేనే తమకు నీరొస్తుందన్న ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి
- మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అలా మాట్లాడొద్దంటూ చీఫ్‌విప్ కాలవ చురక
సాక్షి, అనంతపురం : రాయలసీమ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలను మెరుగు పరుచు కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం, అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా పథకం ద్వారా కోటా మేరకు నీటిని తీసుకువచ్చే విషయంపై సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు తీర్మానం చేశారు. అవసరమైతే ప్రధాన మంత్రినీ కలుద్దామని నిర్ణయించారు. ఆగస్టు 18 నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంతో చర్చించేందుకు హెచ్ఎల్సీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలంతా పార్టీలకు అతీతంగా కదలి రావాలని నిర్ణయించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్య రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు మాట్లాడారు.
పీబీసీకి ప్రతి సంవత్సరమూ అన్యాయమే
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, మైలవరం ప్రాంతాలకు ఇస్తున్న కోటాలో అన్యాయం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని, ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మైలవరం రిజర్వాయర్‌కు ఇచ్చే కోటాను పెన్నానది ద్వారా ఇవ్వడం వల్ల ఒక్క చుక్క కూడా నీరు అందడంలేదన్నారు. ఆ నీటిని కూడా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కే విడుదల చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం చెపుతూ.. సిస్టంను మార్చకూడదని, ఎప్పటిలాగే పెన్నా నది మీదుగానే నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
‘పేరుకే సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఉంది.. మాకేం లాభం లేదు.. గడిచిన పదేళ్లుగా పీబీసీకి చుక్క నీరు రావడం లేదు.. ఫలితంగా పీబీసీ పరిధిలోని చీని, నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయి.. అసలు సీబీఆర్ ఎందుకు.. దాన్ని పగులగొడితేనే మాకు న్యాయం జరుగుతుంద’ంటూ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కలుగచేసుకుని.. ‘సతీష్ రెడ్డి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అలా మాట్లాడుతున్నాడు. ఈ పద్ధతి ఏమీ బాగోలేదు. నేను రాయదుర్గం ఎమ్మెల్యేను. నేను ఎగువ ప్రాంతంలో ఉన్నాను. మా ప్రాంతం నుంచే నీళ్లు కిందకు రావాలి. మేము సర్దుకుపోతున్నాము. ఇక్కడ ఎవరూ మీ నీళ్లు తాగడం లేదు.
నీటి లభ్యత తక్కువగా ఉంటోంది. అసలు హెచ్ఎల్సీకి నిర్ణయించిన మేరకు కోటా రావడం లేదు. నీళ్లు.. మాకు.. మీకు అని గొడవపడితే ఏం లాభం? అందరం కలసి సీఎం వద్దకు వెళ్లి హెచ్ఎల్సీకీ కేటాయింపులు పెంచుకోవడానికి కృషి చేద్దాం.. అప్పుడు అందరం సమానంగా నీటిని వినియోగించుకోవచ్చు’ అని అన్నారు. ‘చిత్రావతికి 50 శాతం నీళ్లు వచ్చినా నీళ్లు కిందకు వదలరు.. అడిగితే ఉన్నవి తాగునీటికి అని చెబుతారు.. చివరకు మాకు నీళ్లు లేకుండా చేస్తారు.. పదేళ్లుగా మా రాత ఇంతేలే అని మా రైతులు మదనపడుతున్నారు.
అసలు సీబీఆర్ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఎన్ని టీఎంసీలు ఇస్తారో తేల్చి చెప్పండి ’అరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగారు. ఈ సారి కూడా చిత్రావతికి తొలుత నీటిని విడుదల చేస్తామని, హెచ్ఎల్సీ ఎస్ఈ వాణినాథ్రెడ్డి సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా ‘అన్ని ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బంది ఉంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రావతికి నీటిని విడుదల చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అలా కాదని చిత్రావతికి మాత్రమే నీరు విడుదల చేస్తే ఒప్పుకునేది లేదు’ అని జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు పేర్కొన్నారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటి కోటా ఏమాత్రం సరిపోదు.. హంద్రీ-నీవా నుంచి పది టీఎంసీల కృష్ణా జలాలు జిల్లాకు తీసుకువస్తే.. జిల్లా అవసరాలు తీరుతాయంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు.
హంద్రీ-నీవా కాలువ నుంచి రాంపురం వద్ద స్లూయిస్ ఏర్పాటు చేస్తే పీఏబీఆర్‌కు హంద్రీ-నీవా నీటిని తీసుకురావచ్చన్నారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ) ఆయకట్టు కింద ఉన్న వరి పంట పూర్తిగా ఎండిపోతోందని, జీబీసీకి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. ఇంతలో కలుగజేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. ‘నీ నియోజకవర్గంలోని కొనకొండ్ల సమీపంలో నిర్మిస్తున్న వంతెన వద్ద ఉన్న పైపులు హంద్రీ-నీవా నీటిని ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.. మొదట నీవు ప్రజలతో మాట్లాడి వాటిని తొలగిస్తే.. పది టీఎంసీలు కాదు.. 15 టీఎంసీలు తీసుకువస్తామ’ని సూచించారు. స్పందించిన విశ్వేశ్వరరెడ్డి మీరు నాతో కలసి వస్తే తప్పకుండా ప్రజలను ఒప్పిస్తానని, మా ప్రాంత ప్రజలకు కావాల్సింది సాగు, తాగు నీరు అని అన్నారు.
మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి మాట్లాడుతూ.. పీఏబీఆర్ కుడి కాలువ నుంచి రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని 49 చెరువులకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలో ‘ఆవులు.. ఆవులు కొట్లాడితే దూడలకు కాళ్లు విరుగుతాయన్నట్లు.. లావోళ్లు.. లావోళ్లు కొట్లాడుకుంటూ శింగనమల నియోజకవర్గాన్ని మరిచిపోతున్నారు. పీబీసీ, సీబీఆర్‌కు నీరు వెళ్లాలంటే శింగనమల నియోజకవర్గం మీదుగానే వెళ్లాలి.. అలాంటిది మా నియోజకవర్గంలో చెరువుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడడడం లేదు. ఇది బాధాకరం. మొదట శింగనమల చెరువుతో పాటు బుక్కరాయసముద్రం చెరువుకు నీళ్లిచ్చిన తరువాత మిగతా నీళ్లు మీరు తీసుకుపోండి’ అంటూ ఎమ్మెల్సీ శమంతకమని డిమాండ్ చేయగా, విప్ యామిని బాల సైతం అందుకు మద్దతు పలికారు.
హంద్రీ-నీవా కాలువ పనుల్లో భాగంగా 162.5 కిలోమీటరు వద్ద కాలువ కాంట్రాక్టు పనులు సీఎం రమేష్ చేస్తున్నారని, ఆ పనులు ముందుకు సాగడం లేదని, అవి త్వరగా పూర్తయితే జిల్లాకు 15 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకువచ్చే అవకాశం ఉందని హంద్రీ-నీవా డీఈ ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. ‘మొదటి దశ పనులు సరిగా చేయలేదు. రెండో దశ పనులు పూర్తి చేయాలంటే రూ.1500 కోట్లు కావాలి. వాటిని తీసుకువచ్చి హంద్రీ-నీవాను పూర్తి చేసే సంకల్పం మీకుందా’ అంటూ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. హంద్రీ-నీవా పనులు పూర్తి చేయడంలో మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి.. వాటిని ఒప్పుకోకుండా కాంట్రాక్టర్ల మీద నెపం నెడితే ఎలా అంటూ కాలవ శ్రీనివాసులు హంద్రీ-నీవా డీఈకి చురకలంటించారు.
కాగా దక్షిణ ప్రాంతంలో ఉన్న మా రైతుల పరిస్థితిని కాస్త గమనించండి.. హంద్రీ-నీవా పనులు త్వరగా పూర్తి చేసి దక్షిణ ప్రాంతంలో ఉన్న మడకశిర ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే ఉన్నం మద్దతు పలికారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేసే సమయంలో ఎక్కువ శాతం అక్రమ అయకట్టు దారులు నీటిని తీసుకెళ్తున్నారని, దీనిని అరికట్టాలని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే జయరాం సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఈరన్న, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్ పాల్గొన్నారు.