City Cable
-
‘ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి కృషే కారణం’
సాక్షి, విజయవాడ : కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు పొట్లూరి రామకృష్ణ అని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. విజయవాడ సిటీ ఛానల్ కార్యాలయంలో జరిగిన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 21వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ.. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణమని, దేశంలో ఎన్నో నెట్‌వర్క్‌లు ఉన్నా ఇప్పటికీ సిటీ కేబుల్ ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారని పేర్కొన్నారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ.. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ బాటలోనే మేమంతా నడుస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే సిటీ కేబుల్ వ్యవస్థ నెంబర్‌వన్‌లో ఉందని తెలిపారు. సిటీ కేబుల్ వ్యవస్థ అభివృద్ధికి ఆపరేటర్లు, ప్రేక్షకులే కారణమని స్పష్టం చేశారు. తమ సంస్థ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి, పొట్లూరి సాయిబాబు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఓ లు, ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దాడికి నిరసనగా రాస్తారోకో
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :సిటీకేబుల్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆదివారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వైసీపీ, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా బాధితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం రాత్రి సిటీకేబుల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారన్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని ప్రచారం చేయలేదనే కోపంతో సుమారు 25 మోటార్ సైకిళ్లపై వచ్చిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. అంతే కాకుండా తాను కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళుతుండగా దాడిచేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చనమాల శ్రీనివాసరావు, బీవీఆర్‌చౌదరి, పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, మంగారామకృష్ణ, కేమిశెట్టి మల్లిబాబు, పి.శ్రీనివాస్, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రామ్‌కుమార్, ప్రింట్మీడియా ప్రతినిధులు వాసా సత్యనారాయణ, పసుమర్తి సాయి, ఎలక్ట్రానిక్ మీడియా సిటికేబుల్ బాలు, రామకృష్ణ, అచ్యుత శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సకలం బంద్
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 48 గంటల బంద్ బుధవారం ప్రారంభమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. పెట్రోల్ బంక్‌లు తెరుచుకోలేదు. థియేటర్లలో ఆటలను రద్దుచేశారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా బెల్ కంపెనీ ఉద్యోగులు విధులను బహిష్కరించి బంద్‌కు మద్దతు పలికారు. ఉయ్యూరు పట్టణాన్నిఆందోళనకారులు దిగ్బంధించారు. గండిగుంట, మంటాడ బైపాస్ వద్ద రాస్తారోకో చేశారు. జేఏసీ పిలుపు మేరకు గుడ్లవల్లేరులో సిటీకేబుల్ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. గుడివాడలో జోరువానలోనూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 37వ రోజుకు చేరుకున్నాయి. చల్లపల్లి ఎస్.ఐ. గౌస్‌పాషా బంద్‌లో పాల్గొన్న కోగంటి ప్రసాద్‌ను చితకబాదడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన సమైక్యవాదులు రామానగరం సినిమాహాల్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. రహదారికి ఇరువైపుల లారీలను అడ్డుగా ఉంచి ఆందోళన చేశారు. జగ్గయ్యపేట పాత మున్సిపల్ సెంటర్లో ఏర్పాటుచేసిన రిలే దీక్షలో బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగం సభ్యులు కూర్చున్నారు. కంభంపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో ముగిశాయి. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో మండలానికి చెందిన 17 మంది పాస్టర్లు కూర్చున్నారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. పామర్రులో జుఝువరం గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షల్లో పాల్గొన్నారు. నందిగామలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లిలో రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. నూజివీడులో బ్రాహ్మణ సంఘం పెద్దలు రిలే దీక్షకు దిగారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 16వ రోజుకు చేరాయి. పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు దీక్షలను ప్రారంభించారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గూడపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్ర మద్దతుగా పెదలంక సర్పంచ్ నడకుదుటి నాగమణి ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు రిలే నిరాహారదీక్ష చేశారు. నూజివీడు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. టాటా మ్యాజిక్ వాహనాల యూనియన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు పట్టణంలో శవయాత్ర నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటర్లో దహనం చేశారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గాంధీ సెంటర్లో పూలబండ్ల వద్ద పూలు విక్రయిస్తూ నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. సిబ్బంది తమ సెల్ఫోన్లను కూడా ఎన్టీటీపీఎస్ యాజమాన్యానికి అప్పగించారు. పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో కూరగాయల షాపులు యజమానులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వీవీఆర్ ఆధ్వర్యంలో కాకర్లమూడి గ్రామానికి చెందిన మహిళలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. విజయవాడలో వ్యాపారం బంద్... వాణిజ్య రాజధాని విజయవాడలో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. హోల్‌సేల్ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, స్వర్ణ వ్యాపారులు బంద్‌లో పాల్గొన్నారు. ఎన్జీవో నేతలు ఆటోలను సైతం అడ్డుకున్నారు. సాయంత్రం నుంచి రాజధానికి వెళ్లే ప్రైవేటు బస్సులను ఎన్జీవో నాయకులు అడ్డుకున్నారు. వన్‌టౌన్ పోస్టాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నేతృత్వంలో నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. ఆటోనగర్ క్రేన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా క్రేన్ల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిట్టినగర్ జంక్షన్లో భారీ మానవహారం నిర్వహించారు. దుర్గగుడి ఉద్యోగులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. జోరువానలోనూ ర్యాలీని కొనసాగించారు. కంకిపాడు సినిమాహాలు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ యార్డు, లాకురోడ్డు, పునాదిపాడు సెంటర్ మీదుగా ఈడుపుగల్లు సెంటర్ వరకు సాగింది.