
సాక్షి, విజయవాడ : కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు పొట్లూరి రామకృష్ణ అని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. విజయవాడ సిటీ ఛానల్ కార్యాలయంలో జరిగిన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 21వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ.. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణమని, దేశంలో ఎన్నో నెట్‌వర్క్‌లు ఉన్నా ఇప్పటికీ సిటీ కేబుల్ ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారని పేర్కొన్నారు.
సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ.. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ బాటలోనే మేమంతా నడుస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే సిటీ కేబుల్ వ్యవస్థ నెంబర్‌వన్‌లో ఉందని తెలిపారు. సిటీ కేబుల్ వ్యవస్థ అభివృద్ధికి ఆపరేటర్లు, ప్రేక్షకులే కారణమని స్పష్టం చేశారు. తమ సంస్థ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి, పొట్లూరి సాయిబాబు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఓ లు, ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment