city central park
-
విశాఖలో పర్యటించిన గవర్నర్ బిశ్వ భూషణ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశాఖ పర్యటనలో భాగంగా కైలాసగిరి, సిటీ సెంట్రల్ పార్కులను సందర్శించారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వర రావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. తొలుత గవర్నర్ పర్యాటక కేంద్రం కైలాసగిరిలో పర్యటించారు. తరువాత తెలుగు మ్యూజియమ్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ సుందరమైన ప్రదేశం.. తెలుగు మ్యూజియం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలుగు అభివృద్ధి కోసం కృషి చేసిన సాహిత్య, రాజకీయ, ప్రముఖుల చిత్రాలు చూడటం ఆనందంగా ఉందన్నారు. రాజా నరసింగరావు, సర్వేపల్లి రాధకృష్ణన్ లాంటి మహోన్నత వ్యక్తులను స్మరించుకున్నానని తెలిపారు. మొదటి సారి 1977లో విశాఖలో జరిగిన కార్మిక సంఘాల సదస్సులో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. తర్వాత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సిటీ సెంట్రల్‌ను పార్క్‌ను సందర్శించారు. మ్యూజికల్ ఫౌంటెన్‌ను తిలకించి.. పార్కులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. -
‘యూనిక్ పార్కుగా తీర్చిదిద్దుతాం’
సాక్షి, విశాఖపట్నం : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం విశాఖలో ఉన్న సిటీ సెంట్రల్ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టారు. వైఎస్సార్ సెంట్రల్ పార్కుగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. నామకరణం అనంతరం పార్కులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ పార్కుకు వైఎస్సార్ సెంట్రల్ పార్కుగా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని ప్రశంసించారు. రాష్ట్రంలో దశల వారిగా ప్రభుత్వం మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అక్టోబర్ నాటికి బెల్టు షాపులు ఎత్తి వేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఒడి ద్వారా జనవరి 26 నుంచి ఏడాదికి రూ. 15 వేలు చెల్లిస్తామని తెలిపారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. యూనిక్ పార్క్‌గా తీర్చిదిద్దుతాం: బొత్స వైఎస్సార్ సెంట్రల్ పార్కును యూనిక్ పార్కుగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 2010లో విశాఖ పార్కుకు రోశయ్య వైఎస్సార్ పార్కుగా నాయకరణం చేశారని.. తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం దాన్ని సహించలేకపోయిందని మండి పడ్డారు. సెప్టెంబర్ 2న వైఎస్‌విగ్రహావిష్కరణ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదవాడికి మేలు జరిగింది అంటే వైఎస్సార్ వల్లనే అన్నారు. చదువులో ఏపీ, కేరళతో సమానంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కార్యక్రమాలను ఆశీర్వదించండి అని కోరారు. -
ఇక వైఎస్సార్ సెంట్రల్ పార్క్
సాక్షి, విశాఖపట్నం: నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం విశాఖ నగర సిగలో ఉన్న సిటీ సెంట్రల్ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మార్గం సుగమమైంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది దీంతోపాటు పార్కులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకూ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న పాత జైలును పడగొట్టి ఆరిలోవలో కొత్త జైలును ఏర్పాటు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏం నిర్మించాలన్నదానిపై ఎన్నో ఆలోచనలొచ్చాయి. షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ లేదా పరిశ్రమలకు ఇవ్వాలని వచ్చిన ప్రపోజల్స్ ప్రభుత్వం ముందుంచారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రం.. విశాఖ నగరం నడిబొడ్డులో అంతటి విశాల స్థలం దొరకడం గగనమనీ.. ఆ ప్రాంతంలో నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచేలా సుందరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. 2011లో అప్పటి అర్బన్ డెవలప్మెంట్ బాడీ వైస్ ఛైర్మన్ కోన శశిధర్ ఆ పార్కుకి వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పార్కులో రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ రెండు నిర్ణయాలను తొక్కిపెట్టేసింది. రాజ కీయ కుట్రలతో వైఎస్సార్ పేరు పెట్టకుండా 2016లో వైజాగ్ సిటీ సెంట్రల్ పార్క్‌గా నామకరణం చేస్తూ ప్రారంభించారు. ప్రైవేట్ పార్కు దిశగా... మరోవైపు పార్కు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే విశేష ఆదరణ లభించింది. దీంతో సెంట్రల్ పార్కును ప్రైవేట్ పరం చెయ్యాలని టీడీపీ మంత్రులు కుట్రలు పన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలు పోరాటం చెయ్యడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఫలించనున్న అవంతి కృషి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అవంతి శ్రీనివాస్ గత నెలలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వైజాగ్ సెంట్రల్ పార్కు పేరును.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చెయ్యాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పేరు మార్పునకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను మంత్రి అవంతి ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాలు, కృషి ఫలితంగా సోమవారం నుంచి పార్కు పేరు మారనుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చేతుల మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది. దీంతో పాటు పార్కులో 11 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. -
రహస్యంగా ఎలా కట్టబెడతారు?
సెంట్రల్‌పార్క్ వుడాయే నిర్వహించాలి.. నేడు ఎమ్మెల్యేలంతా వీసీని కలుస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సాక్షి, విశాఖపట్నం: నగరంలో కొత్తగా ప్రారంభించిన సిటీ సెంట్రల్ పార్కును రహస్యంగా ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయమని, సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 20 ఎకరాల స్థలాన్ని 20 ఏళ్ల పాటు లీజుకిచ్చే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. ఈనెల 14న ‘సెంట్రల్ పార్కుపై పచ్చ డేగల విహారం’ శీర్షికతో తొలిసారిగా సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి విదితమే. ఓ మంత్రి సన్నిహితుడికి దీన్ని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్న వైనాన్ని తేటతెల్లం చేసింది. ఇది అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలోనూ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో మాట్లాడారు. ఒకసారి టెండరుదారుడికి కట్టబెట్టాక 20 ఏళ్లదాకా వెనక్కి తీసుకోవడానికి వీలుండదన్నారు. సుదీర్ఘంగా విస్తరించి ఉన్న వుడాకు రూ.10 కోట్లు ఖర్చు చేసి పార్కును నిర్వహించే సామర్థ్యం లేదా? అని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ విధానంలో అవసరమైన సిబ్బందిని నియమించి పార్కు నిర్వహణ బాధ్యతను వుడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అడ్డదారి టెండర్ల వ్యవహారాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలంతా బుధవారం వుడా వీసీని కలిసి ప్రైవేటు వ్యక్తులకు కట్టవద్దని స్పష్టం చేస్తామన్నారు. ఇప్పటికే కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరంలో ఆహ్లాదాన్నిచ్చే పార్కుగా దీన్ని రూపొందించాలని, వ్యాపార దృక్పథంతో చూడడం తగదని చెప్పారు. సింగపూర్‌లోని సెంటోసా ఐలండ్‌లో ఇలాంటి పార్కే ఉందని, అక్కడ సందర్శకులను ఉచితంగా అనుమతిస్తున్నారని తెలిపారు. కానీ విశాఖలో ఈ పార్కులో ప్రవేశానికి పగలు రూ.20, రాత్రి రూ.60 టిక్కెట్టు ధర నిర్ణయించడం అభ్యంతరకరమన్నారు. ఈ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.