వైజాగ్ సెంట్రల్ పార్కు
సాక్షి, విశాఖపట్నం: నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం విశాఖ నగర సిగలో ఉన్న సిటీ సెంట్రల్ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మార్గం సుగమమైంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది దీంతోపాటు పార్కులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకూ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న పాత జైలును పడగొట్టి ఆరిలోవలో కొత్త జైలును ఏర్పాటు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏం నిర్మించాలన్నదానిపై ఎన్నో ఆలోచనలొచ్చాయి.
షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ లేదా పరిశ్రమలకు ఇవ్వాలని వచ్చిన ప్రపోజల్స్ ప్రభుత్వం ముందుంచారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రం.. విశాఖ నగరం నడిబొడ్డులో అంతటి విశాల స్థలం దొరకడం గగనమనీ.. ఆ ప్రాంతంలో నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచేలా సుందరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. 2011లో అప్పటి అర్బన్ డెవలప్‌మెంట్ బాడీ వైస్ ఛైర్మన్ కోన శశిధర్ ఆ పార్కుకి వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పార్కులో రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రకటించారు.
ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ రెండు నిర్ణయాలను తొక్కిపెట్టేసింది. రాజ కీయ కుట్రలతో వైఎస్సార్ పేరు పెట్టకుండా 2016లో వైజాగ్ సిటీ సెంట్రల్ పార్క్‌గా నామకరణం చేస్తూ ప్రారంభించారు. ప్రైవేట్ పార్కు దిశగా... మరోవైపు పార్కు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే విశేష ఆదరణ లభించింది. దీంతో సెంట్రల్ పార్కును ప్రైవేట్ పరం చెయ్యాలని టీడీపీ మంత్రులు కుట్రలు పన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలు పోరాటం చెయ్యడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఫలించనున్న అవంతి కృషి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అవంతి శ్రీనివాస్ గత నెలలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైజాగ్ సెంట్రల్ పార్కు పేరును.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చెయ్యాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పేరు మార్పునకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను మంత్రి అవంతి ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాలు, కృషి ఫలితంగా సోమవారం నుంచి పార్కు పేరు మారనుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చేతుల మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది. దీంతో పాటు పార్కులో 11 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment