ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.
గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.
కొత్త పన్ను విధానం
2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్‌లను క్లెయిమ్ చేయవచ్చు.
స్టాండర్డ్ డిడక్షన్
వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
సెక్షన్ 80సీ
సెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్‌లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
హోమ్ లోన్
మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.
అదనపు వివరాలు
ఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment