రహస్యంగా ఎలా కట్టబెడతారు?
సెంట్రల్‌పార్క్ వుడాయే నిర్వహించాలి..
నేడు ఎమ్మెల్యేలంతా వీసీని కలుస్తాం..
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కొత్తగా ప్రారంభించిన సిటీ సెంట్రల్ పార్కును రహస్యంగా ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయమని, సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 20 ఎకరాల స్థలాన్ని 20 ఏళ్ల పాటు లీజుకిచ్చే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. ఈనెల 14న ‘సెంట్రల్ పార్కుపై పచ్చ డేగల విహారం’ శీర్షికతో తొలిసారిగా సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి విదితమే. ఓ మంత్రి సన్నిహితుడికి దీన్ని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్న వైనాన్ని తేటతెల్లం చేసింది.
ఇది అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలోనూ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో మాట్లాడారు. ఒకసారి టెండరుదారుడికి కట్టబెట్టాక 20 ఏళ్లదాకా వెనక్కి తీసుకోవడానికి వీలుండదన్నారు. సుదీర్ఘంగా విస్తరించి ఉన్న వుడాకు రూ.10 కోట్లు ఖర్చు చేసి పార్కును నిర్వహించే సామర్థ్యం లేదా? అని ప్రశ్నించారు.
ఔట్ సోర్సింగ్ విధానంలో అవసరమైన సిబ్బందిని నియమించి పార్కు నిర్వహణ బాధ్యతను వుడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అడ్డదారి టెండర్ల వ్యవహారాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలంతా బుధవారం వుడా వీసీని కలిసి ప్రైవేటు వ్యక్తులకు కట్టవద్దని స్పష్టం చేస్తామన్నారు.
ఇప్పటికే కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరంలో ఆహ్లాదాన్నిచ్చే పార్కుగా దీన్ని రూపొందించాలని, వ్యాపార దృక్పథంతో చూడడం తగదని చెప్పారు. సింగపూర్‌లోని సెంటోసా ఐలండ్‌లో ఇలాంటి పార్కే ఉందని, అక్కడ సందర్శకులను ఉచితంగా అనుమతిస్తున్నారని తెలిపారు. కానీ విశాఖలో ఈ పార్కులో ప్రవేశానికి పగలు రూ.20, రాత్రి రూ.60 టిక్కెట్టు ధర నిర్ణయించడం అభ్యంతరకరమన్నారు. ఈ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.