సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేవాలయం లాంటి శాసనసభను రాజకీయ సభలా వాడుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు, పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టి ప్రశ్నించినప్పుడే ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకూ 29 సార్లు ఢిల్లీ వెళ్లామని చెపుతున్నారు.. కానీ ఎందుకు అన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. కేవలం 11 సార్లు మాత్రమే అపాయింట్‌మెంట్ అడిగి, ప్రధాని మోదీని కలిశారని తెలియచేశారు.
పట్టిసీమను బీజేపీ వ్యతిరేకించలేదని, ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మాత్రమే వ్యతిరేకించిందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపమని మూడు నెలలుగా కోరుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. అవినీతి జరగకపోతే విచారణకు సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. స్వలాభం కోసం విద్యార్థులు, యువకులను వాడుకుంటారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో రైల్వే జోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరుగుతున్న మొదటి రాష్ట్రం ఆంద్రప్రదేశ్ అంటూ అసెంబ్లీ నిర్వహణా తీరును విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment