డిజైన్లపై సలహాలివ్వండి
రాజధానిపై సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాలు కొనాలంటే మామూలుగా అయితే రూ.40 వేల కోట్లు ఖర్చయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఒకవేళ అంత ఖర్చు పెట్టినా భూములిచ్చేవారు కాదన్నారు. వెలగపూడి అసెంబ్లీలోని కమిటీ హాలులో శనివారం రాజధాని పరిపాలనా నగరం డిజైన్లపై మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధాని భూములకు మంచి విలువ వస్తుందన్నారు.
ఎమ్మెల్యేలు మంచి ఐడియాలు ఇవ్వాలని.. అప్పుడే మంచి కంపెనీలు వస్తాయన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో నిర్మించే ఏడు కీలక రోడ్లకు ముఖ్యమంత్రి ఉగాది రోజున శంకుస్థాపన చేస్తారని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని 6.9 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సింగపూర్ కన్సార్టియంకు స్విస్ చాలెంజ్ విధానంలో ఇవ్వనున్నట్లు చెప్పారు.
నదీముఖంగా పరిపాలనా నగరం: నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ విశ్లేషకుడు హర్ష థాపర్ తమ వ్యూహ డిజైన్లపై ప్రజెంటేషన్ ఇస్తూ... పరిపాలనా నగరం దక్షిణం నుంచి ఉత్తరం వైపు నదీముఖంగా ఉంటుందని... పది శాతం జల వనరులు, 51 శాతం పచ్చదనంతో నిండి ఉంటుందని తెలిపారు. ఉత్తరం వైపున బయో పార్క్ ఉంటుందని, తిరుపతిలోని కోనేరు, లండన్‌లోని ట్రఫాల్‌గర్ స్క్వేర్ తరహాలో ఒక సిటీ స్క్వేర్‌ను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. నగరంలో 50, 24, 16 మీటర్ల వెడల్పు రోడ్లతోపాటు నడక కోసం తొమ్మిది మీటర్ల వెడల్పు రోడ్లను డిజైన్ చేశామన్నారు.
నగరానికి నాలుగు గేట్‌వేలు ఉంటాయని, అసెంబ్లీకి ఎదురుగా కల్చరల్ సెంటర్ ఉంటుందని చెప్పారు. మెట్రో రైలు వ్యవస్థతోపాటు డ్రైవర్లు లేని వాహనాలుంటాయన్నారు. అసెంబ్లీకి, ఎమ్మెల్యే క్వార్టర్లకు ఎంత దూరం ఉంటుందని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. పరిపాలనా నగరం నాలుగు బ్లాకులుగా ఉంటుందని, కార్యాలయాలు, నివాసాల మధ్య ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. మొత్తం తొమ్మిది నగరాల్లో 27 టౌన్‌షిప్‌లు ఉంటాయన్నారు.