కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 33
అంతేగాదు, పశువుల పెంపకం మూలంగా మనిషికి మరికొన్ని విషయాల మీద దృష్టిని కేంద్రీకరించే అగత్యం ఏర్పడింది. వాటిల్లో మొదటిది సంఖ్యా పరిజ్ఞానం. పశుపెంపకం ఇప్పటికీ చేపట్టని ఆటవిక తెగలకు ఈనాడు కూడా నాలుగు లేదా ఐదుకు మించి లెక్కించడం చేతగాదు. అంతకుమించిన సంఖ్యలతో వాళ్ళకు అవసరం కూడా ఉండదు. మేత నుండి మంద మొత్తం తిరిగొచ్చిందో లేక ఒకటిరెండు జీవాలు తప్పిపోయాయో తెలుసుకోవాలంటే పశువుల కాపరికి ఎక్కువ సంఖ్యలను లెక్కించడం నేర్చుకోక తప్పేదిగాదు. అలా ఒకటిరెండ్లు పన్నెండుదాకా పెరిగాయి. గుమిగా లెక్కించేందుకు ఉడ్డాలూ, డజన్లూ ఏర్పాటయ్యాయి. మరో ఐదువేల సంవత్సరాల దాకా గణితంలో సున్నా ప్రవేశించలేదు కాబట్టి, దశమస్థానంలో తెంచుకుని లెక్కించడం వాళ్ళకు పరిచయం లేదు.
ఆ తరువాత, స్థల కాలాలను అంచనా వేసే విధానం గూడా తప్పనిసరిగా సాధించుకోవలసిన పరిజ్ఞానమైంది. ఆ ప్రయత్నంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే పేర్లతో దిక్కులను గుర్తించే ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న దూరాలను అడుగుల్లోనూ, మధ్యరకం దూరాలను ‘పగ్గం’తోనూ, ఇంకా ఎక్కువ దూరాన్ని ‘గవ్యూతి’తోనూ కొలవడం నేర్చుకున్నాడు.
దినాలు లెక్క పెట్టేందుకు చంద్రుణ్ణి ఆసరా చేసుకున్నాడు. సూర్యుడు రోజూ ఒకేలా కనిపిస్తాడు గాబట్టి, రోజుల నడక తెలుసుకునేందుకు సూర్యునితో ప్రయోజనం లేదనుకున్నాడు. క్రీ.శ. 16వ శతాబ్దంలో సూర్యమానం మీద ఏర్పడిన ‘సివిల్ క్యాలెండర్’ వాడుకలోకి వచ్చేవరకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన క్యాలెండర్ చాంద్రమానమే. హిందువుల ముహూర్తాలూ, మహమ్మదీయుల పండుగలూ ఇప్పటికీ చాంద్రమానాన్నే అనుసరిస్తున్నాయి. చంద్రుని ఆధారంగా ఏర్పడిన పంచాంగంలో ఏడాదికి ఏర్పడే 336 రోజులను తిథులుగా, పక్షాలుగా, మాసాలుగా గుణిస్తారు. వారాలుగానీ, ఆది సోమ వంటి దినాలుగానీ అందులో ఉండవు. అందుకే మహాభారతంలో తిథులే కనిపిస్తాయి తప్ప వారాలు కనిపించవు. ఏడాదికుండే 365 1/4 రోజులను పూరించేందుకు ‘అధిక మాసాలు’ గుణించడం గమనిస్తే, సూర్యమానం ఏడాది గురించి ఋగ్వేదకాలం నాటికే కొంత తెలిసినట్టు కనిపిస్తుంది. అయితే, ఋగ్వేదం చెప్పిన సూర్యమాన సంవత్సరానికి 360 రోజులే. ఆ తరువాత క్రీ.శ.5వ శతాబ్దంవాడైన ఆర్యభట్టు, 6వ శతాబ్దం వాడైన వరాహమిహురుడు భారతదేశంలో సూర్యమాన పంచాంగాన్ని ప్రవేశపెట్టగా, 12వ శతాబ్దంవాడైన భాస్కరుడు కొన్ని సవరణలతో దాన్ని స్థిరీకరించాడు.
పగ్గాల కోసం రకరకాల ‘నార’ను అన్వేషించే క్రమంలో కొత్తరాతి యుగం మానవునికి ‘అగిసె’నార తటస్థించింది. అది మిగతా పీచుపదార్థాలకంటే చాలా మృదువు, పోగు సన్నం. చాపల అల్లకంలాగా పోగుమార్చి పోగు దాన్ని అల్లుకోవడం మొదట్లో సరదాకింద తీసుకున్నా, తరువాత తరువాత అది నారబట్టల నేతకు దారితీసింది.
ఆ వస్త్రం ఎంత ముతకదైనా, జంతు చర్మాలకంటే, భూర్జర పత్రాలకంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, నారబట్టలు కట్టుకునే అలవాటు సమాజంలో ప్రవేశించింది. ఆ బట్టలకు రంగులు అద్దిన ఆనవాళ్ళు మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆ మాటకొస్తే, కొత్తరాతియుగం మానవునికి రంగులపట్లా, చిత్రకళపట్లా, శిల్పంపట్లా అభిరుచేలేనట్టుంది. ఎందుకంటే, అతని హయాంలో ఒక్కచోటున్నైనా గుహాచిత్రాలుగాని, దంతపు బొమ్మలుగాని నిదర్శనంగా దొరకలేదు. బహుశా, ఇప్పుడు సొంత సామర్థ్యం మీద కుదిరిన నమ్మకం అతన్ని తాంత్రిక విశ్వాసాల నుండి దూరంగా నడిపించిందో ఏమో!
రచన: ఎం.వి.రమణారెడ్డి