సన్నబియ్యానికి రీ టెండర్
- కఠినంగా నిబంధనలు
- పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకంతోపాటు సంక్షేమ వసతిగృహాలకు సరఫరా చేసే సన్నబియ్యం కొనుగోలు టెండర్లు రద్దు చే శామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ ప్రకటించారు. సన్నబియ్యం కొనుగోలు టెండర్లపై కమిషనర్ శనివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ధరల విషయంలో రాజీ పడకుండా నిబంధనలను కఠినంగా రూపొందించామన్నారు. రద్దు చేసిన టెండర్లలో 50 కిలోల సామర్థ్యం గల గన్నీ సంచులు, ధరావతు(ఈఎండీ)గా రూ.33 లక్షలు ఉండేవని తెలిపారు. రీ టెండర్లో మాత్రం గన్నీ సంచుల స్థానంలో 50 కిలోల సామర్ధ్యం గల జూట్ సంచులు ఉంటాయని, మిల్లర్ల మధ్య పోటీ పెంచేందుకు ఈఎండీని రూ.10 లక్షలకు తగ్గించామని అన్నారు. శాఖ నిబంధనలను అతిక్రమించే సరఫరాదారులకు సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లించకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్‌లోని బోయగూడ, ముషీరాబాద్‌లోని రేషన్‌షాపులను ఆనంద్ శనివారం తనిఖీ చేశారు. సీఆర్వో, జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయాలను కూడా పరిశీలించారు. రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్ పనితీరు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకులు పక్కదారి పట్టకుండా జీపీఎస్, ఈ-పాస్‌తోపాటు ఐటీని పూర్తిస్థాయిలో వినియోగిస్తామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులపై కఠినకేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నామని వివరించారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంపు అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు.