ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కు కొత్త యాప్..!
మీరు యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన జనరల్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నారా? అటువంటి అవసరం ఉన్నవారు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చారు కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని అందులో పొందు పరిచారు. ఒక్కసారి డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. ఈ యాప్ సహాయంతో ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంతో సులభం అవుతుందంటున్నారు.
జనరల్ నాలెడ్జ్ కోసం ఆన్ లైన్ న్యూస్ చదవడం, న్యూస్ పేపర్లు తిరగేయాల్సి రావడం మామూలే. అలా చేసినా ఒక్కోసారి పూర్తి సమాచారం దొరక్కపోవచ్చు. ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇదే సమస్య ఎదురౌతుంది. ఇటువంటి వారికోసం 27 ఏళ్ళ రోహిత్ పాండే, అతని స్నేహితుడు శిఖర్ సచన్ లు కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్తున్నారు.
సివిల్స్ డైలీ పేరున రూపొందించిన కొత్త యాండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ లో ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన విషయాలన్నీఅందుబాటులో ఉంటాయని ఈ స్నేహితులు చెప్తున్నారు. సులభంగా అర్థమయ్యే ఫార్మాట్ లో, ముఖ్యమైన వార్తల సమాహారాన్ని ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతారు. శిఖర్, రోహిత్ లు కలిసి ఈ యాప్ ను 2015 మార్చిలో ప్రారంభించారు. ప్రతిరోజూ వచ్చే న్యూస్ పేపర్లలోని వార్తలను సంక్షిస్తంగా ఈ యాప్ లో పొందుపరచడంతో విద్యార్థులు పరీక్షకు సులభంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. యాప్ లో ఉండే న్యూస్ కార్డు ప్రతి విషయాన్ని నాలుగైదు సింపుల్ పాయింట్స్ లో వివరించేందుకు ఉపయోగ పడుతుంది.
ఈ యాప్ తాజాగా సుమారు నలభై వేల సార్లు డౌన్లోడ్ చేయబడింది. ఇందులో సుమారు పదినుంచీ పధ్నాలుగు కొత్త స్టోరీలు ప్రతిరోజూ అప్ డేట్ చేస్తారు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడ రోహిత్ టీమ్.. యాప్ లో అందుబాటులో ఉంచుతారు. ఇంటిర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కూడ ఈ యాప్ ను వినియోగించేందుకు వెబ్సైట్ తో అవసరం లేకుండా..ఆఫ్ లైన్లో పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో కూడ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో రోహిత్ టీం యోచిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన రోహిత్ టీం కు ఆర్నెల్లుగా ఈ యాప్ వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో యాప్ ను మరింత అభివృద్ధి పరిచేందుకు ఈ స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. ఐఐటీ గౌహతి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రోహిత్... కొన్ని కన్సల్టింగ్ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2014 లో స్వతహాగా యాప్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. భారత దేశంలో సాంకేతిక విద్య పూర్తిగా అభివృద్ధి కాలేదని, ఈ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని రోహిత్ అంటున్నారు. అందులో భాగంగానే కొత్త యాప్ ను అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు.