సివిల్స్ నోట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి మెళకువలు పాటించాలి?
సివిల్స్ నోట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి మెళకువలు పాటించాలి?
- మహ్మద్ ఇస్మాయిల్, అఫ్జల్‌గంజ్
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: మారిన సివిల్స్ పరీక్ష విధానంలో ప్రశ్నలన్నీ వర్తమాన వ్యవహారాలు, సమాజంలో, మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. మెయిన్స జనరల్ స్టడీస్‌లోని నాలుగు పేపర్లు, ఎస్సే మొత్తం అదేవిధంగా ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవే. అయితే వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్‌లా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో అప్డేట్ చేసుకుంటుండాలి. వీటిని వీలైనప్పుడు చదువుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా వీటిని పదేపదే చదవాలి. ఇంటర్నెట్పై అతిగా ఆధారపడకూడదు. దీనివల్ల కాలయాపన అవుతుంది.
ఇన్పుట్స్: డాక్టర్ బీజేబీ. కృపాదానం, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్
ఎస్బీఐ క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి?
- పి.సృజన, మాసాబ్‌ట్యాంక్
బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనకు అన్వయ సామర్థ్యం అవసరం. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి.
అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ కావాల్సింది నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి.
అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అన్నది విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కావా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సన్నద్ధం కావాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు.
ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్,
సీనియర్ ఫ్యాకల్టీ