civils toppers
-
స్వాతంత్య్ర సమరయోధుల గ్రామంలో మరో ఇద్దరు తెలుగు తేజాలు
సివిల్ సర్వీసెస్.. ఎంతోమందికి తీరని కల. ఎందరో తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒక్కరైనా దీనిని సాధించాలని ఆశ. మరి అలాంటి కల ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సాధిస్తే.. వారి ఆనందానికి, తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉంటాయా? అయితే ఈ అరుదైన ఘనతను గుండుగొలనుకు చెందిన అన్నాదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్ సాధించారు. సాక్షి, భీమడోలు(పశ్చిమ గోదావరి): సివిల్స్‌లో 32వ ర్యాంక్‌తో అన్న ఐఏఎస్, 170వ ర్యాంక్‌తో తమ్ముడు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా మంచి సంపాదన ఉన్నా ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగాలను వదిలి సివిల్స్ బాట పట్టారు. నాలుగు సార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అన్న, రెండో ప్రయత్నంలోనే తమ్ముడు విజేతలుగా నిలిచి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’తో తమ మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలమైనా.. ఇప్పుడు నేరుగా ఐఏఎస్‌కి ఎంపికవడం ఏమనిపిస్తోంది? జగత్‌సాయి : చాలా సంతోషంగా ఉంది. 2015 నుంచి 2021 వరకు సివిల్స్ పరీక్షలు రాశా. సరైన మార్గదర్శకులు లేక తొలి విడత ప్రాథమిక పరీక్షల్లో విఫలమయ్యా. తర్వాత ఇంటర్వ్యూ దశకు వెళ్లినా అతి విశ్వాసం, ఇతర పొరపాట్ల వల్ల ర్యాంకు సాధించలేకపోయా. అయినప్పటికీ అమ్మ, నాన్న నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో 32వ ర్యాంకుతో ఐఏఎస్‌ను సాధించి తల్లిదండ్రుల కలను సాకారం చేశా. 2014లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పూనే, చైన్నైలో పనిచేశా. జీతం బాగున్నా నాకు సంతృప్తినివ్వలేదు. కొన్ని నెలలే పనిచేసి రిజైన్ చేశా. సాధన ఏలా సాగింది? జగత్‌సాయి : సివిల్స్‌లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ముఖాముఖి మూడు దశలూ ముఖ్యమే. ప్రాథమిక పరీక్షల్లో అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సన్నద్ధత సమయంలో అలాంటివి సాధన చేసేవాడిని. ఎక్కువగా నమూనా పత్రాలు వేగంగా పూర్తి చేసేవాడిని. దీంతో ఏ సబ్జెక్టుకు సంబంధించి వాటిలో బలహీనంగా ఉన్నమో తెలుసుకుని అందుకు అనుగుణంగా సాధన చేశా. మెయిన్స్‌లోని వ్యాసరూప పరీక్షల్లో చరిత్ర, ఆర్థికం, రాజనీతి, భూగోళశాస్త్రం అంశాలపై ఎక్కువగా అవగాహన పెంచుకున్నాను. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. ఎలా సాధ్యమైంది ? వసంతకుమార్ : నాన్న విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తుండడంతో నేను ఇంజినీర్ కావాలని అనుకున్నా. అన్నయ్య కార్పొరేట్ సెక్టార్లో పనిచేసి రిజైన్ చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండటంతో తన బాటలో నడిచా. సివిల్స్‌లో పట్టు సాధించడం ఎలాగో అన్నయ్య నుంచి నేర్చుకున్నా. ఇద్దరం కలిసి అనేక అంశాలపై చర్చించుకునేవాళ్లం. తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీలో విఫలమయ్యా. రెండో ప్రయత్నంలో 170వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించడం సంతోషంగా ఉంది. సివిల్స్‌లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి? జవాబు : సమాజ సేవ, సంస్కృతి, సత్సంబంధాలు తదితర అంశాలు ఉన్న సబ్జెక్ట్ కావడంతో ఇద్దరం ఆంత్రోపాలజీని ఎంచుకున్నాం. హైదరాబాద్‌లో నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నాం. ఢిల్లీలో నిపుణుల ఇంటర్వ్యూలు ఎదుర్కొనడం, మెలకువలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకున్నాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో క్లాస్‌లు విన్నాం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు స్టడీ నడిచేది. 11, 12 తరగతుల సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు, రోజూ దినపత్రికలు చదివేవాళ్లం. ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొన్నారు? జవాబు : ఇంటర్వ్యూలో అభ్యర్థిని అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. సమకాలీన అంశాలపైనే ప్రశ్నలు ఎక్కువ. వీటికి సమాధానాలు మనోనిబ్బరంతో సూటిగా, స్పష్టంగా చెబుతున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. ఏపీ నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లడంతో స్థానిక సమస్యలపై ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్, మూడు రాజధానులపై అభిప్రాయాలు అడిగారు. జిల్లా, గ్రామం ప్రాధాన్యత వివరాలు చెప్పాం సివిల్స్ కోసం సిద్ధమవుతున్న యువతకు మీరిచ్చే సూచనలు ? జవాబు : సివిల్స్ రాసేందుకు చక్కని తరీ్ఫదు అవసరం. మార్గదర్శకుల సూచనల మేరకు సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ పొందాలి. సివిల్స్ ర్యాంకు సాధించాలన్న తపన, కఠోర శమ, పట్టుదలతో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తారు. ప్రజలకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? జగత్‌సాయి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తుంటాయి. వాటిని అర్హులైనవారి చెంతకు సకాలంలో అందేలా యంత్రాంగం సహకారంతో కృషి చేస్తాను. పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తాను. ప్రజలకు సేవ చేయలన్నదే నా లక్ష్యం. నేరాల అదుపును ఏ విధంగా చేస్తారు? వసంతకుమార్ : సమాజంలో నేరాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు నన్ను తీవ్రంగా కలిచివేస్తాయి. శాంతిభద్రతల రక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తాను. సివిల్స్ పరీక్షలు రాయాలన్న ప్రేరణ ఎవరి నుంచి కలిగింది ? అమ్మానాన్నలు గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదివారు. టెన్త్‌లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యారు. తల్లి అనసూయకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండేది. అయితే అది సాధ్యపడలేదు. నాన్న భీమేశ్వరరావు ఎలక్ట్రికల్ ఏఈగా పని చేయడం, ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందులు పరిష్కరించడం చూశాం. దీంతో తామూ ప్రభుత్వ సర్వీస్‌ల్లోకి రావాలన్న కోరిక కలిగింది. అమ్మ మాలో స్ఫూర్తిని నింపి పోటీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించింది. విద్యాభ్యాసం ఏలా సాగింది ? జగత్‌సాయి : నాన్న విద్యుత్ శాఖలో ఇంజినీర్ కావడంతో మా చదువు ఉభయగోదావరి జిల్లాల్లో సాగింది. 1 నుంచి 7వ తరగతి వరకు ఐ.పోలవరం, తాడేపల్లిగూడెంల్లో సాగింది. 8 నుంచి ఇంటర్ వరకు శశి వెలివెన్నులో చదివాం. తమిళనాడులోని రాయవల్లూరులోని విట్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. కళాశాల టీమ్‌కు నేను కెప్టెన్. వసంతకుమార్ : చిన్నతనం నుంచి గుండుగొలనులో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నా. 1 నుంచి 7 వరకు, 8 నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు పాఠశాల, కళాశాలల్లో చదివా. వైజాగ్ మధురవాడలోని గాయత్రి పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ పూర్తి చేశా. నాకూ క్రికెట్ ఆడటం ఇష్టమే. ప్రజాసేవకు మించి ఉన్నతమైనది లేదన్నాం... తల్లిదండ్రులు: అందరి తల్లిదండ్రుల్లాగానే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించాం. వారిపై పెద్ద గోల్స్‌ను రుద్దలేదు. ఉన్నత చదువుల అనంతరం పెద్దబ్బాయి నాలుగు సార్లు సివిల్స్‌లో విఫలమైనా నిరాశ చెందవద్దని, మరింత శ్రద్ధ పెట్టి పట్టుదలతో సాధించాలని ప్రోత్సహించాం. ప్రజాసేవ చేసేందుకు ఇంతకు మించిన అవకాశం లేదని వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాం. ఐదేళ్ల పాటు మాకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాన్ని సాధించారు. అన్నదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్ -
మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా పని చేయండి
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్ర కేడర్‌లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్ విజేతలకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రం నుంచి ఇటీవల సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 10 మంది మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. -
సివిల్స్‌లో సిక్కోలు తేజాలు
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సిక్కోలు అభ్యర్థులు సత్తాచాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 658, 678, 704 ర్యాంకుల సాధించి ప్రతిభకనబరిచారు. అకుంఠిత దీక్షతో పరీక్షలకు సన్నద్ధమై లక్ష్యాన్ని అందుకున్నారు. ► సివిల్స్‌లో రవి‘తేజం’ ► తొలి ప్రయత్నంలోనే 678వ ర్యాంకు ► 21 ఏటే అర్హత సాధించిన మునుకోటి సాక్షి, శ్రీకాకుళం : పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక సివిల్స్‌కు ఎంపికయ్యాడు మునుకోటి రవితేజ. పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు అర్హత సాధించి సత్తా చాటాడు. 678వ ర్యాంకుతో ఆదర్శంగా నిలిచాడు. జలుమూరుకు చెందిన రవితేజ తండ్రి బుచ్చిరాజు ఏపీ సీఐడీలో ఇన్స్పెక్టర్గా విశాఖలో పనిచేస్తున్నారు. పదో తరగతి వరకు నగరంలోని విజ్ఞాన్ స్కూలులో చదివిన రవితేజ ప్రతిభతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఈసీఈలో చేరాడు. గత ఏడాది జులై లో బీటెక్ పూర్తి చేసుకున్న ఆయన ‘గేట్’ ఫలితాల్లో మంచి ర్యాంకు వచ్చినా కాదని, తన లక్ష్యమైన సివిల్ వైపు దృష్టి సారించాడు. హైదరాబాద్‌లోని లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కేవలం రెండు నెలల పాటు కోచింగ్ తీసుకుని ప్రిలిమ్స్ రాశాడు. అక్టోబర్‌లో వెలువడ్డ ఫలితాల్లో విజయం సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ వాజీరాం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని మెయిన్స్‌లోనూ అర్హత పొందాడు. తాజా ఫలితాల్లో 678 ర్యాంకు సాధించి 21 ఏళ్లకే సివిల్స్‌కు ఎంపికైన యువకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు. ఐఏఎస్ నా లక్ష్యం.. బీటెక్ అయ్యాక సివిల్స్‌కు రెండు మూడు నెలల పాటు బాగా కష్టపడి ప్రిపేరయ్యాను. 500-600 మధ్య ర్యాంకు వస్తుందని ఊహించాను. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఏఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. నాకొచ్చిన 678 ర్యాంకుతో ఐఆర్ఎస్ వస్తుందనుకుంటున్నా. చేరడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఈలోగా మరోసారి ప్రయత్నిస్తా. ఐఏఎస్ సాధించగలనన్న నమ్మకం ఉంది. -మునుకోటి రవితేజ, సివిల్స్ 678 ర్యాంకర్ 704వ ర్యాంకు సాధించిన కృష్ణారావు పొందూరు : మండలంలోని పెనుబర్తి పశువైద్యాధికారి(వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ సిగిలిపల్లి కృష్ణారావు 704వ ర్యాంకును సాధించారు. తాను ఐఆర్ఎస్కు గానీ, ఐపీఎస్‌కు గానీ ఎంపికయ్యే అవకాశం ఉందని కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారావు తండ్రి నారాయణమూర్తి బీఎస్ఎన్ఎల్లో టెక్నికల్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి రాధమ్మ గృహిణి. కోటబొమ్మాలి మండలం దుప్పలపాడు గ్రామంలో నివసిస్తున్నారు. డాక్టర్ కృష్ణారావు భార్య కళ్యాణి డ్రగ్ ఇన్స్పెక్టర్. అన్నయ్య బ్యాంకు పీఓగా, చెల్లి రాజపురంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని మూడేళ్లుగా పట్టుదలతో చదివానని కృష్ణారావు తెలిపారు. 2014లో 10 మార్కుల తేడాతో లక్ష్యం కోల్పోయానని చెప్పారు. పగలు ఉద్యోగం, రాత్రిపూట ఐదు నుంచి ఆరు గంటల సమయం చదువుకు కేటాయించానని అన్నారు. ఇంటర్నెట్, న్యూస్ పేపర్లు, పుస్తకాలను విశ్లేషణాత్మకంగా చదవడంతో విజయం వరించిందన్నారు. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షన్‌గా ఎంచుకొన్నానని చెప్పారు. ఏప్రిల్ 8న జరిగిన ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ రంగం, ఏపీ, తెలంగాణ విభజన తర్వాత పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, పార్లమెంట్ బిల్లులపై ప్రశ్నలు అడిగారని కృష్ణారావు తెలిపారు. పేదరికాన్ని జయించి... 658 ర్యాంకు సాధించిన ఆటోడ్రైవర్ కొడుకు శ్రీకాకుళం : తండ్రి ఆటో డ్రైవర్. చుట్టూ పేదరికం. పట్టుదలే ఆయుధంగా సివిల్స్‌లో మెరిశాడు. ఐదో ప్రయత్నంలో 658 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు ఆమదాలవలస నియోజకవర్గం తుర్లకోట గ్రామానికి చెందిన మధుసూదనరావు. బొబ్బిలిలోని ఓ పాఠశాలలో 470 మార్కులతో పదో తరగతి పూర్తి చేసిన అతడు శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(బైపీసీ 838 మార్కులు) చదివాడు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో 75 శాతం మార్కులతో బీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఏయూలో సీనియర్ రీసెర్చ్ ఫెలో(పీహెచ్డీ) చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఇంటిలిజెన్స్ బ్యూరో (సీబీఐ)లో ఎనిమిది నెలలు పనిచేసిన మధుసూదనరావు సివిల్స్ పూర్తి చేయాలన్న పట్టుదలతో తన ప్రయత్నాలను కొనసాగించాడు. సొంతంగా ప్రిపేర్ అయి రెండుసార్లు మెయిన్స్ వరకు వెళ్లాడు. ఐదో ప్రయత్నంలో 658 ర్యాంకును కైవసం చేసుకున్నారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను మా నాన్న ఆటో డ్రైవర్‌గా, అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. ఎలాగైనా సివిల్స్‌లో ర్యాంకు సాధించాలని పట్టుదలతో చదివాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రివేర్ అవుతూ వచ్చాను. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. చాలా ఆనందంగా ఉంది. కష్టపడి చదివించిన తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటాను. సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఐ.మధుసూదనరావు, 658వ ర్యాంకర్ -
సివిల్స్‌లో ఆ నలుగురు
ఒంగోలు: చదివేశారు.. నాలెడ్జ్‌ను పట్టేశారు..ర్యాంకులు కొట్టేశారు. ప్రతి పట్టభద్రుని కల సివిల్‌సర్వీసెస్. దానిలో ఉత్తమ ర్యాంకులు సాధించడటం అంటే పెద్ద సవాలే. అరుుతే మనవాళ్లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. దీనివెనుక కఠోర శ్రమ.. కృషి.. పట్టుదల ఉంది. అందుకే జిల్లా పేరును దేశంలో మార్మోగించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో ఒంగోలువాసి షేక్ రిజ్వాన్‌బాషా సత్తా చాటారు. ఈయన స్వస్థలం మార్కాపురం. తండ్రి పోలీసు డిపార్టుమెంట్లో ఉద్యోగి. ఆయన చీరాలలో పనిచేస్తున్న సమయంలో రిజ్వాన్‌బాషా అక్కడ ఆదిత్య పబ్లిక్ స్కూలులో.. అనంతరం చీరాలలోని విజ్ఞానభారతి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ చేశారు. నాలుగు సంవత్సరాలపాటు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలి దశలో 1214 ర్యాంకు వచ్చింది. దీంతో కేంద్ర సమాచార విభాగంలో సహాయ సంచాలకులుగా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 847 ర్యాంకు లభించింది. బాషా కుటుంబం ప్రస్తుతం ఒంగోలులోని సుజాతానగర్ మొదటి లైనులో నివాసం ఉంటోంది. ఈయన తండ్రి అబ్దుల్ మాజిద్ జిల్లా పోలీసు కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పత్రికలు చదువడం.. నోట్సు తయారుచేసుకోవడం, పరీక్షా విధానంపై అవగాహన పెంచుకున్నారు. ‘బెంగళూరులో స్నేహితులతో కలిసి రూములో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. నా లక్ష్యం మాత్రం ఐఏఎస్’ అని చెప్పారు. రెండో ప్రయత్నంలో 103వ ర్యాంకు కందుకూరు: గుడ్లూరు మండలం గుళ్లపాలెంకు చెందిన స్నేహజ సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించారు. రెండో ప్రయత్నంలోనే 103వ ర్యాంకు సాధించి సివిల్స్ సర్వీస్‌కు ఎంపికయ్యూరు. గుళ్లపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, సుజాతలు తల్లిదండ్రులు. తండ్రి హైదరాబాద్‌లో ఆడిటర్ కావడంతో ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. స్నేహజ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్‌లో సీఏ కోర్సు పూర్తి చేసిన స్నేహజ ఆ తరువాత సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న తర్వాత మొదటి ప్రయత్నంలో డిఫెన్స్ విభాగంలో ఉద్యోగానికి ఎంపికయ్యూరు. గుళ్లపాలెంలో ఆమె తాత, నానమ్మలు, బాబాయి వెంకటాద్రి, కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన అమ్మాయి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. కనిగిరి ఆణిముత్యం కనిగిరి: మండల పరిధిలోని పునుగోడుకు చెందిన ఉపాధ్యాయుడు అల్లాటిపల్లి నారాయణరెడ్డి, రత్నమ్మ దంపతుల కుమారు పవన్ కుమార్రె డ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటి ఐపీఎస్‌కు సెలక్టు అయ్యూరు. 1 నుంచి 4వ తరగతి వరకు నేరేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 5వ తరగతి పునుగోడు ప్రభుత్వ పాఠశాలలో.. 6 నుంచి 10 వరకు ఒంగోలు నవోదయలో విద్యను అభ్యసించారు. ఆ సమయంలో కలెక్టర్ సునీల్ శర్మ స్ఫూర్తితో సివిల్ సర్వీస్‌కు ఎంపిక కావాలని నిర్ణరుుంచుకున్నారు. ఇంటర్ నెల్లూరు రత్నం స్కూల్లో, ఏజీ బీఎస్సీ బాపట్లలో, ఏజీ ఎంబీఏ ఉత్తరఖండ్‌లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఈఓగా దొనకొండలో ఉద్యోగం చేస్తూనే 2012 నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసి 179వ ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు.. బంధువైన ఆల్ఫా విద్యాసంస్థల అధినేత జి. మాలకొండారెడ్డి ప్రోత్సాహం మరువలేనన్నారు. కనిగిరి ప్రాంతం నుంచి రెండో ఐపీఎస్ అధికారిగా ఏ పవన్ కుమార్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆవుల రమేష్‌రెడ్డి పదేళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. రైతు బిడ్డకు 216వ ర్యాంకు కొమరోలు: మండలంలోని ఇడమకల్లు గ్రామానికి చెందిన సంజామల వెంకటేశ్వర్‌కు 216వ ర్యాంకు వచ్చింది. వెంకటేశ్వర్ తండ్రి వెంకటయ్య రైతు. మొదటి కుమారుడు వైద్యుడుగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర్ కూడా విశాఖపట్టణంలో వైద్య వృత్తిలో ఉన్నారు.10వ తరగతి గుంటూరులోని లయాలా పబ్లిక్ స్కూల్లో, ఇంటర్మీడియెట్ విశాఖపట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2013లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2013లో ఐఆర్ఏఎంకు ఎంపికయ్యారు. 2014లో ఐడీఈఎఫ్కు ఎంపికయ్యారు.