సివిల్స్‌లో సిక్కోలు తేజాలు
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సిక్కోలు అభ్యర్థులు సత్తాచాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 658, 678, 704 ర్యాంకుల సాధించి ప్రతిభకనబరిచారు. అకుంఠిత దీక్షతో పరీక్షలకు సన్నద్ధమై లక్ష్యాన్ని అందుకున్నారు.
► సివిల్స్‌లో రవి‘తేజం’
► తొలి ప్రయత్నంలోనే 678వ ర్యాంకు
► 21 ఏటే అర్హత సాధించిన మునుకోటి
సాక్షి, శ్రీకాకుళం : పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక సివిల్స్‌కు ఎంపికయ్యాడు మునుకోటి రవితేజ. పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు అర్హత సాధించి సత్తా చాటాడు. 678వ ర్యాంకుతో ఆదర్శంగా నిలిచాడు. జలుమూరుకు చెందిన రవితేజ తండ్రి బుచ్చిరాజు ఏపీ సీఐడీలో ఇన్‌స్పెక్టర్‌గా విశాఖలో పనిచేస్తున్నారు. పదో తరగతి వరకు నగరంలోని విజ్ఞాన్ స్కూలులో చదివిన రవితేజ ప్రతిభతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఈసీఈలో చేరాడు.
గత ఏడాది జులై లో బీటెక్ పూర్తి చేసుకున్న ఆయన ‘గేట్’ ఫలితాల్లో మంచి ర్యాంకు వచ్చినా కాదని, తన లక్ష్యమైన సివిల్ వైపు దృష్టి సారించాడు. హైదరాబాద్‌లోని లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో కేవలం రెండు నెలల పాటు కోచింగ్ తీసుకుని ప్రిలిమ్స్ రాశాడు. అక్టోబర్‌లో వెలువడ్డ ఫలితాల్లో విజయం సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ వాజీరాం ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుని మెయిన్స్‌లోనూ అర్హత పొందాడు. తాజా ఫలితాల్లో 678 ర్యాంకు సాధించి 21 ఏళ్లకే సివిల్స్‌కు ఎంపికైన యువకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఐఏఎస్ నా లక్ష్యం..
బీటెక్ అయ్యాక సివిల్స్‌కు రెండు మూడు నెలల పాటు బాగా కష్టపడి ప్రిపేరయ్యాను. 500-600 మధ్య ర్యాంకు వస్తుందని ఊహించాను. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఏఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. నాకొచ్చిన 678 ర్యాంకుతో ఐఆర్‌ఎస్ వస్తుందనుకుంటున్నా. చేరడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఈలోగా మరోసారి ప్రయత్నిస్తా. ఐఏఎస్ సాధించగలనన్న నమ్మకం ఉంది.
-మునుకోటి రవితేజ,
సివిల్స్ 678 ర్యాంకర్
704వ ర్యాంకు సాధించిన కృష్ణారావు
పొందూరు : మండలంలోని పెనుబర్తి పశువైద్యాధికారి(వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ సిగిలిపల్లి కృష్ణారావు 704వ ర్యాంకును సాధించారు. తాను ఐఆర్‌ఎస్‌కు గానీ, ఐపీఎస్‌కు గానీ ఎంపికయ్యే అవకాశం ఉందని కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారావు తండ్రి నారాయణమూర్తి బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెక్నికల్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి రాధమ్మ గృహిణి. కోటబొమ్మాలి మండలం దుప్పలపాడు గ్రామంలో నివసిస్తున్నారు. డాక్టర్ కృష్ణారావు భార్య కళ్యాణి డ్రగ్ ఇన్‌స్పెక్టర్. అన్నయ్య బ్యాంకు పీఓగా, చెల్లి రాజపురంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని మూడేళ్లుగా పట్టుదలతో చదివానని కృష్ణారావు తెలిపారు. 2014లో 10 మార్కుల తేడాతో లక్ష్యం కోల్పోయానని చెప్పారు. పగలు ఉద్యోగం, రాత్రిపూట ఐదు నుంచి ఆరు గంటల సమయం చదువుకు కేటాయించానని అన్నారు. ఇంటర్నెట్, న్యూస్ పేపర్లు, పుస్తకాలను విశ్లేషణాత్మకంగా చదవడంతో విజయం వరించిందన్నారు. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షన్‌గా ఎంచుకొన్నానని చెప్పారు. ఏప్రిల్ 8న జరిగిన ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ రంగం, ఏపీ, తెలంగాణ విభజన తర్వాత పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, పార్లమెంట్ బిల్లులపై ప్రశ్నలు అడిగారని కృష్ణారావు తెలిపారు.
పేదరికాన్ని జయించి...
658 ర్యాంకు సాధించిన ఆటోడ్రైవర్ కొడుకు
శ్రీకాకుళం : తండ్రి ఆటో డ్రైవర్. చుట్టూ పేదరికం. పట్టుదలే ఆయుధంగా సివిల్స్‌లో మెరిశాడు. ఐదో ప్రయత్నంలో 658 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు ఆమదాలవలస నియోజకవర్గం తుర్లకోట గ్రామానికి చెందిన మధుసూదనరావు. బొబ్బిలిలోని ఓ పాఠశాలలో 470 మార్కులతో పదో తరగతి పూర్తి చేసిన అతడు శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(బైపీసీ 838 మార్కులు) చదివాడు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో 75 శాతం మార్కులతో బీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఏయూలో సీనియర్ రీసెర్చ్ ఫెలో(పీహెచ్‌డీ) చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఇంటిలిజెన్స్ బ్యూరో (సీబీఐ)లో ఎనిమిది నెలలు పనిచేసిన మధుసూదనరావు సివిల్స్ పూర్తి చేయాలన్న పట్టుదలతో తన ప్రయత్నాలను కొనసాగించాడు. సొంతంగా ప్రిపేర్ అయి రెండుసార్లు మెయిన్స్ వరకు వెళ్లాడు. ఐదో ప్రయత్నంలో 658 ర్యాంకును కైవసం చేసుకున్నారు.
తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను
మా నాన్న ఆటో డ్రైవర్‌గా, అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. ఎలాగైనా సివిల్స్‌లో ర్యాంకు సాధించాలని పట్టుదలతో చదివాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రివేర్ అవుతూ వచ్చాను. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. చాలా ఆనందంగా ఉంది. కష్టపడి చదివించిన తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటాను. సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
ఐ.మధుసూదనరావు, 658వ ర్యాంకర్