సివిల్ సర్వీసెస్.. ఎంతోమందికి తీరని కల. ఎందరో తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒక్కరైనా దీనిని సాధించాలని ఆశ. మరి అలాంటి కల ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సాధిస్తే.. వారి ఆనందానికి, తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉంటాయా? అయితే ఈ అరుదైన ఘనతను గుండుగొలనుకు చెందిన అన్నాదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్ సాధించారు.
సాక్షి, భీమడోలు(పశ్చిమ గోదావరి): సివిల్స్‌లో 32వ ర్యాంక్‌తో అన్న ఐఏఎస్, 170వ ర్యాంక్‌తో తమ్ముడు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా మంచి సంపాదన ఉన్నా ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగాలను వదిలి సివిల్స్ బాట పట్టారు. నాలుగు సార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అన్న, రెండో ప్రయత్నంలోనే తమ్ముడు విజేతలుగా నిలిచి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’తో తమ మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.
సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలమైనా.. ఇప్పుడు నేరుగా ఐఏఎస్‌కి ఎంపికవడం ఏమనిపిస్తోంది?
జగత్‌సాయి : చాలా సంతోషంగా ఉంది. 2015 నుంచి 2021 వరకు సివిల్స్ పరీక్షలు రాశా. సరైన మార్గదర్శకులు లేక తొలి విడత ప్రాథమిక పరీక్షల్లో విఫలమయ్యా. తర్వాత ఇంటర్వ్యూ దశకు వెళ్లినా అతి విశ్వాసం, ఇతర పొరపాట్ల వల్ల ర్యాంకు సాధించలేకపోయా. అయినప్పటికీ అమ్మ, నాన్న నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో 32వ ర్యాంకుతో ఐఏఎస్‌ను సాధించి తల్లిదండ్రుల కలను సాకారం చేశా. 2014లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పూనే, చైన్నైలో పనిచేశా. జీతం బాగున్నా నాకు సంతృప్తినివ్వలేదు. కొన్ని నెలలే పనిచేసి రిజైన్ చేశా.
సాధన ఏలా సాగింది?
జగత్‌సాయి : సివిల్స్‌లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ముఖాముఖి మూడు దశలూ ముఖ్యమే. ప్రాథమిక పరీక్షల్లో అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సన్నద్ధత సమయంలో అలాంటివి సాధన చేసేవాడిని. ఎక్కువగా నమూనా పత్రాలు వేగంగా పూర్తి చేసేవాడిని. దీంతో ఏ సబ్జెక్టుకు సంబంధించి వాటిలో బలహీనంగా ఉన్నమో తెలుసుకుని అందుకు అనుగుణంగా సాధన చేశా. మెయిన్స్‌లోని వ్యాసరూప పరీక్షల్లో చరిత్ర, ఆర్థికం, రాజనీతి, భూగోళశాస్త్రం అంశాలపై ఎక్కువగా అవగాహన పెంచుకున్నాను.
రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. ఎలా సాధ్యమైంది ?
వసంతకుమార్ : నాన్న విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తుండడంతో నేను ఇంజినీర్ కావాలని అనుకున్నా. అన్నయ్య కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేసి రిజైన్ చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండటంతో తన బాటలో నడిచా. సివిల్స్‌లో పట్టు సాధించడం ఎలాగో అన్నయ్య నుంచి నేర్చుకున్నా. ఇద్దరం కలిసి అనేక అంశాలపై చర్చించుకునేవాళ్లం. తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీలో విఫలమయ్యా. రెండో ప్రయత్నంలో 170వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించడం సంతోషంగా ఉంది.
సివిల్స్‌లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి?
జవాబు : సమాజ సేవ, సంస్కృతి, సత్సంబంధాలు తదితర అంశాలు ఉన్న సబ్జెక్ట్ కావడంతో ఇద్దరం ఆంత్రోపాలజీని ఎంచుకున్నాం. హైదరాబాద్‌లో నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నాం. ఢిల్లీలో నిపుణుల ఇంటర్వ్యూలు ఎదుర్కొనడం, మెలకువలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకున్నాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్లాస్‌లు విన్నాం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు స్టడీ నడిచేది. 11, 12 తరగతుల సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలు, రోజూ దినపత్రికలు చదివేవాళ్లం.
ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు : ఇంటర్వ్యూలో అభ్యర్థిని అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. సమకాలీన అంశాలపైనే ప్రశ్నలు ఎక్కువ. వీటికి సమాధానాలు మనోనిబ్బరంతో సూటిగా, స్పష్టంగా చెబుతున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. ఏపీ నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లడంతో స్థానిక సమస్యలపై ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్, మూడు రాజధానులపై అభిప్రాయాలు అడిగారు. జిల్లా, గ్రామం ప్రాధాన్యత వివరాలు చెప్పాం
సివిల్స్ కోసం సిద్ధమవుతున్న యువతకు మీరిచ్చే సూచనలు ?
జవాబు : సివిల్స్ రాసేందుకు చక్కని తరీ్ఫదు అవసరం. మార్గదర్శకుల సూచనల మేరకు సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ పొందాలి. సివిల్స్ ర్యాంకు సాధించాలన్న తపన, కఠోర శమ, పట్టుదలతో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తారు.
ప్రజలకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు?
జగత్‌సాయి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తుంటాయి. వాటిని అర్హులైనవారి చెంతకు సకాలంలో అందేలా యంత్రాంగం సహకారంతో కృషి చేస్తాను. పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తాను. ప్రజలకు సేవ చేయలన్నదే నా లక్ష్యం.
నేరాల అదుపును ఏ విధంగా చేస్తారు?
వసంతకుమార్ : సమాజంలో నేరాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు నన్ను తీవ్రంగా కలిచివేస్తాయి. శాంతిభద్రతల రక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తాను.
సివిల్స్ పరీక్షలు రాయాలన్న ప్రేరణ ఎవరి నుంచి కలిగింది ?
అమ్మానాన్నలు గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదివారు. టెన్త్‌లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యారు. తల్లి అనసూయకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండేది. అయితే అది సాధ్యపడలేదు. నాన్న భీమేశ్వరరావు ఎలక్ట్రికల్ ఏఈగా పని చేయడం, ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందులు పరిష్కరించడం చూశాం. దీంతో తామూ ప్రభుత్వ సర్వీస్‌ల్లోకి రావాలన్న కోరిక కలిగింది. అమ్మ మాలో స్ఫూర్తిని నింపి పోటీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించింది.
విద్యాభ్యాసం ఏలా సాగింది ?
జగత్‌సాయి : నాన్న విద్యుత్ శాఖలో ఇంజినీర్ కావడంతో మా చదువు ఉభయగోదావరి జిల్లాల్లో సాగింది. 1 నుంచి 7వ తరగతి వరకు ఐ.పోలవరం, తాడేపల్లిగూడెంల్లో సాగింది. 8 నుంచి ఇంటర్ వరకు శశి వెలివెన్నులో చదివాం. తమిళనాడులోని రాయవల్లూరులోని విట్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. కళాశాల టీమ్‌కు నేను కెప్టెన్.
వసంతకుమార్ : చిన్నతనం నుంచి గుండుగొలనులో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నా. 1 నుంచి 7 వరకు, 8 నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు పాఠశాల, కళాశాలల్లో చదివా. వైజాగ్ మధురవాడలోని గాయత్రి పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ పూర్తి చేశా. నాకూ క్రికెట్ ఆడటం ఇష్టమే.
ప్రజాసేవకు మించి ఉన్నతమైనది లేదన్నాం...
తల్లిదండ్రులు: అందరి తల్లిదండ్రుల్లాగానే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించాం. వారిపై పెద్ద గోల్స్‌ను రుద్దలేదు. ఉన్నత చదువుల అనంతరం పెద్దబ్బాయి నాలుగు సార్లు సివిల్స్‌లో విఫలమైనా నిరాశ చెందవద్దని, మరింత శ్రద్ధ పెట్టి పట్టుదలతో సాధించాలని ప్రోత్సహించాం. ప్రజాసేవ చేసేందుకు ఇంతకు మించిన అవకాశం లేదని వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాం. ఐదేళ్ల పాటు మాకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాన్ని సాధించారు.
అన్నదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్
Comments
Please login to add a commentAdd a comment