చిత్తూరులో సీసీఎల్ సెజ్
⇒ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంటు ఏర్పాటు
⇒ మొత్తం రూ.340 కోట్ల పెట్టుబడి
⇒ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో సెజ్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. వరదయ్యపాలెం మండలం కువ్వకొల్లి వద్ద కంపెనీ 100 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 25 ఎకరాల్లో సెజ్ రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ తయారీ ప్లాంటు నెలకొల్పనున్నట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ యూనిట్లో 2018 అక్టోబరు–డిసెంబరు నాటికి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. సెజ్ రాకతో పన్ను ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే సంస్థకు గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు వియత్నాం, స్విట్జర్లాండులోనూ కాఫీ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
ఎగుమతుల కోసం..
సెజ్‌లో ఏర్పాటు కానున్న ప్లాంటు వార్షిక సామర్థ్యం 5,000 టన్నులు ఉండనుంది. దీని కోసం రూ.340 కోట్ల దాకా పెట్టుబడి పెట్టనున్నట్టు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పూర్తిగా ఎగుమతుల కోసమే దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 200 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. దుగ్గిరాల ప్లాంటు వార్షిక సామర్థ్యం 20,000 టన్నులు. స్విట్జర్లాండ్ ప్లాంటు 3,000 టన్నులు. వియత్నాం ప్లాంటు 10,000 టన్నులు ఉంది. మూడేళ్లలో వియత్నాం ప్లాంటు సామర్థ్యం రెట్టింపు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్నారు. సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,000కి పైమాటే.
వందలాది బ్రాండ్లలో..
ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ లేబుల్ విభాగంలో ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తిలో ఈ సంస్థ ప్రపంచ నంబర్ వన్‌గా ఉంది. స్ప్రే డ్రైడ్ కాఫీ పౌడర్, స్ప్రే డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్, ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్, ఫ్రీజ్ కాన్సెంట్రేటెడ్ లిక్విడ్, డీకాఫీనేటెడ్ కాఫీ, ఫ్లేవర్డ్ కాఫీ తదితర విభాగాల్లో 200లకు పైగా స్పెషాలిటీ క్రాఫ్టెడ్ బ్లెండ్స్లో కాఫీలను తయారు చేస్తోంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీలు వివిధ బ్రాండ్లలో విక్రయిస్తున్నాయి. సంస్థ ఆదాయంలో ఎగుమతుల వాటా 97 శాతముంది. సీసీఎల్ తన సొంత కాంటినెంటల్ బ్రాండ్‌లో భారత్‌లో పలు నగరాల్లో కాఫీని అమ్ముతోంది.
దిగుమతుల ప్రభావం లేదు..
వియత్నాం నుంచి కాఫీ గింజలతో సహా ఆరు ఉత్పత్తుల దిగుమతులను భారత ప్రభుత్వం మార్చి 7 నుంచి బ్యాన్ చేసింది. 2015–16 ఏడాదిలో కాఫీ గింజల దిగుమతులు 64 వేల టన్నుల్లో సగ భాగం వియత్నాం నుంచి కొనుగోలు చేసినవే. ముడి కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలు టాప్‌లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒకే ధర ఉండడంతో ఇప్పుడు ఇతర దేశాలపై కంపెనీలు ఆధారపడతాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రభావం తమ కంపెనీపై ఉండదని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వియత్నాంలో కంపెనీకి భారీ ప్లాంటు ఉందని గుర్తు చేశారు. గుంటూరు ప్లాంటుకు కావాల్సిన ముడి కాఫీని భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు.