నేను అమాయకుడ్ని
న్యూఢిల్లీ: ‘నేను అమాయకుడ్ని. నన్ను అనవసరంగా ఈ అత్యాచార కేసులో ఇరికించారు. తప్పుడు అభియోగాలు నా మీద మోపారు’ అని మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసులో నిందితుడైన ఉబర్ క్యాబ్ డ్రైవర్ యోగేంద్ర నాథ్ మంగళవారం అడిషనల్ సెషన్స్ జడ్జి కావేరి బవేజా ఎదుట వాంగ్మూలమిచ్చాడు. ఈ కేసు విచారణ గత శనివారం ముగియగా, ప్రస్తుతం సాక్ష్యాలను రికార్డు చేస్తున్నారు. గత డిసెంబరు5న యోగేంద్ర యాదవ్ ఓ మహిళా ప్రయాణికురాలిపై కారులోనే రాత్రంతా అత్యాచారం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అయితే బాధితురాలిని ఇందర్లోక్లో కారు ఎక్కించుకుని పంజాబీ బాగ్లో గల ఆమె ఇంటి వద్ద దింపానని, ఆమెను తాను ఏమీ చేయలేదని నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆమె కారు ఎక్కిన సమయంలో ఎందుకో ఏడుస్తుందని, తాను అందుకు కారణమడగగా చెప్పలేదని చెప్పాడు. అయితే ఆమెకు పెళ్లి నిశ్చయమైందని, కానీ చిన్ననాటి స్నేహితుడు ఆమెను వేధిస్తున్నట్లు ఆ కాల్ చేసిన వ్యక్తికి చెప్పిందని తెలిపాడు. ఆమెను ఇంటి దగ్గర దింపినప్పుడు కారులోనే ఫోను మర్చిపోతే, తీసుకెళ్లి ఇచ్చానని పేర్కొన్నాడు. అంతే తప్ప తనకు ఏమీ తెలియదన్నాడు. తాను అమాయకుడ్ని అని, తప్పుడు కేసు మోపారని చెప్పాడు. ఆమె ఎందుకు ఆ విధంగా కేసు పెట్టిందో అర్థం కావడం లేదని నిందితుడు తెలిపాడు. కాగా, నిందితుడు కేసు విచారణ సందర్భంగా పోలీసులపై గతంలో కొన్ని ఆరోపణలు చేయడం, అవి నిజం కాదని తేలడం జరిగింది.