Clark
-
తాగుబోతులా నా గురించి మాట్లాడేది
తనపై వచ్చిన విమర్శలపై తొలిసారి మాట్లాడిన క్లార్క్ సిడ్నీ: యాషెస్ సిరీస్ ఓటమితో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలిసారి మౌనం విడాడు. తనపై వచ్చిన విమర్శలపై చాలా ఘాటుగా స్పందించాడు. యాషెస్ సిరీస్ పరాజయాల నేపథ్యంలో తన నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించిన మాజీలు సైమండ్స్, హేడెన్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాగి దేశానికి ఆడిన వ్యక్తి తన కెప్టెన్సీ గురించి మాట్లాడతాడా? అంటూ సైమోపై ధ్వజమెత్తాడు. ‘నా నాయకత్వాన్ని అంచనా వేసే స్థాయి సైమండ్స్‌కు లేదు. తాగినోడు నాపై రాళ్లు వేస్తే చూస్తూ ఉండాలా’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి క్లార్క్ నిరాకరించేవాడని, బలవంతంగా హెల్మెట్ అప్పగిస్తే బ్యాగీ గ్రీన్‌ను వెనక్కి ఇచ్చేస్తానని పాంటింగ్‌ను బెదిరించేవాడని అప్పట్లో హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తన రికార్డులు వీటికి సమాధానం చెబుతాయని క్లార్క్ స్పందించాడు. ‘గత 12 ఏళ్లుగా నా విలువేంటో అందరికి తెలిసింది. దేశానికి ఎంత పేరు తెచ్చానో అందరూ చూశారు. నేను ఆడిన మ్యాచ్‌లే నేనేంటో నిరూపిస్తున్నాయి. ఒకవేళ పాంటింగ్ హర్బర్ బ్రిడ్జిపై నుంచి దూకమంటే మారుమాట్లాడకుండా దూకేస్తా. ఆసీస్‌కు ఆడటం నాకు ఇష్టం. దానికోసం ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉండేవాణ్ని’ అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు. కుక్క కూడా కోచింగ్ చేయగలదు.. తన నాయకత్వంలో ఆసీస్ జట్టు సంస్కృతి పూర్తిగా చెడిపోయిందని వ్యాఖ్యానించిన బుకానన్‌పై క్లార్క్ విమర్శలు గుప్పించాడు. ‘జాన్‌కు బ్యాగీ గ్రీన్ గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని అతనెప్పుడూ ధరించలేదు. బుకానన్ నిజాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. అతని వల్లే ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం వచ్చిందనుకుంటున్నాడేమో... నా కుక్క కోచింగ్ ఇచ్చినా అంతే ఆధిపత్యం చూపెట్టేవాళ్లం. జట్టు సంస్కృతి భిన్నంగా ఉండాలని స్టీవ్ వా, గిల్‌క్రిస్ట్, పాంటింగ్‌లు ప్రయత్నించారు. కానీ నా హయాంలో ఇది కాస్త తగ్గింది. రానురాను మరింతగా మారిపోయింది. ఇది నన్ను చాలా నిరాశకు గురిచేసింది’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
‘మిస్సైల్’ జాన్సన్
అడిలైడ్: కనీసం రెండో టెస్టులోనైనా రాణించి యాషెస్ సిరీస్‌ను సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ (7/40) నీళ్లు చల్లాడు. నిప్పులు చెరిగే బంతులతో కుక్ సేనను వణికించాడు. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై క్లార్క్ సేన పట్టు బిగించింది. జాన్సన్ దెబ్బకు శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో కంగారూలకు 398 పరుగుల ఆధిక్యం లభించింది. బెల్ (72 నాటౌట్), కార్‌బెరీ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 530 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్నర్ (83 బ్యాటింగ్), స్మిత్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (15), పీటర్సన్ (4) వెంటనే అవుటయ్యారు. కార్‌బెరీ, బెల్ నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జాన్సన్ బంతులకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. బెల్ క్రీజులో నిలదొక్కుకున్నా... రెండోఎండ్‌లో ఆసీస్ పేసర్ వరుస పెట్టి వికెట్లు తీస్తూ పోయాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకు చివరి 7 వికెట్లు కోల్పోయింది. లియోన్, సిడిల్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు.