
‘మిస్సైల్’ జాన్సన్
అడిలైడ్: కనీసం రెండో టెస్టులోనైనా రాణించి యాషెస్ సిరీస్‌ను సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ (7/40) నీళ్లు చల్లాడు. నిప్పులు చెరిగే బంతులతో కుక్ సేనను వణికించాడు. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై క్లార్క్ సేన పట్టు బిగించింది. జాన్సన్ దెబ్బకు శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో కంగారూలకు 398 పరుగుల ఆధిక్యం లభించింది.
బెల్ (72 నాటౌట్), కార్‌బెరీ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 530 పరుగుల ఆధిక్యంలో ఉంది.
వార్నర్ (83 బ్యాటింగ్), స్మిత్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (15), పీటర్సన్ (4) వెంటనే అవుటయ్యారు. కార్‌బెరీ, బెల్ నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జాన్సన్ బంతులకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. బెల్ క్రీజులో నిలదొక్కుకున్నా... రెండోఎండ్‌లో ఆసీస్ పేసర్ వరుస పెట్టి వికెట్లు తీస్తూ పోయాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకు చివరి 7 వికెట్లు కోల్పోయింది. లియోన్, సిడిల్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు.