ఎస్కార్ట్ సైట్లో అమ్మాయిల ఫోన్ నెంబర్లు పెట్టి..
మైసూరు: కర్ణాటకలోని మైసూర్ యూనివర్శిటీలో పర్యావరణ శాస్త్రం ఫైనలియర్ చదువుతున్న జయంత్ కుమార్ అనే విద్యార్థి.. తన క్లాస్మేట్స్ అయిన ముగ్గురు అమ్మాయిలపై కోపంతో వారి ఫొటోలను, ఫోన్ నెంబర్లను ఎస్కార్ట్ సైట్లో అప్లోడ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు జయంత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషయల్ కస్టడీకి ఆదేశించింది.
పీజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో ఆ ముగ్గురు అమ్మాయిల కంటే జయంత్‌కు ఎక్కువ మార్కులు వచ్చాయి. తన కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయిలు తనపై అసూయతో తప్పుడు ఆరోపణలు చేశారని జయంత్ చెప్పాడు. లెక్చరర్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే తనకు ఎక్కువ మార్కులు వేశారని అమ్మాయిలు నిందించారని తెలిపాడు. అమ్మాయిలు లెక్చరర్ దేవీప్రసాద్‌పై యూనివర్శిటీ రిజస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఆయనకు తాను బంట్రోతులా పనిచేస్తున్నానని నిందించారని జయంత్ చెప్పాడు. అమ్మాయిలపై కోపంతో వారి వివరాలను ఎస్కార్ట్ సైట్లో అప్లోడ్ చేశాడు. దీంతో అపరిచితుల నుంచి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు రావడంతో విసుగుచెందిన అమ్మాయిలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి జయంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాము దేవీ ప్రసాద్ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయలేమని, ఆయన క్లాస్‌లో బూతు జోకులు వేస్తారని అమ్మాయిలు అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనివర్శిటీ అధికారులు దేవీ ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు.