చెత్త వేసి మరీ శుభ్రంచేశారు!
న్యూఢిల్లీ: శుభ్రమైన, ఆరోగ్యభారతమే లక్ష్యంగా పక్షం రోజులుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘స్వచ్ఛతా హీ సేవా అభియాన్’ కార్యక్రమాన్ని కేంద్ర ఐటీ, పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ తనదైన శైలిలో పూర్తిచేశారు. ఢిల్లీలోని ఇండియాగేట్ చుట్టూ ఉన్న పచ్చికబయళ్లలోని చెత్తను తొలగించేందుకు మంత్రి ఆల్ఫోన్స్ తన అధికారులు, సిబ్బందితో కలసి అక్కడికి వచ్చారు.
అయితే, ఆ ప్రాంతమంతా శుభ్రంగా ఉండటంతో అధికారులు.. కొందరు కళాశాల విద్యార్థులను పురమాయించి వేరే చోట ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అలా తీసుకొచ్చిన ఖాళీ నీళ్ల బాటిళ్లు, పాన్‌మసాలా సాషేలు, ఐస్‌క్రీమ్ కప్పులు, ఎండుటాకులు, చెత్తను మంత్రి సేకరించి చెత్త డబ్బాల్లో వేశారు. మహాత్మునికి నివాళిగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ రెండో తేదీవరకు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నారు.