clerk aresst
-
చాటుగా లేఖలు చదువుతూ..
కాకినాడ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయం డిస్పాచ్ సెక్షన్‌లోని ఓ క్లర్క్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కంచే చేను మేసిన చందంగా జి.శ్రీనివాస్ అనే క్లర్క్ వ్యవహరించాడు. డిస్పాచ్ సెక్షన్లో ఉంటూ వివిధ విభాగాలకు.. ముఖ్యంగా అధికారులకు వస్తున్న లేఖలను చాటుగా ఎన్వలప్‌లు తెరచి చదువుతూండటం అధికారులను, సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఆ లేఖల ఫొటోలు తన సెల్ఫోన్లో తీసుకొని, మళ్లీ వాటిని అతికించి, ఏమీ ఎరుగనట్లు అధికారుల సెక్షన్లకు పంపిస్తున్నాడనే విషయం బట్టబయలైంది. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ వద్ద శ్రీనివాస్ ఆటలు సాగలేదు. ఎస్పీకి స్వయానా ఆయన పేరుతో వచ్చిన ఓ లేఖను చదివి శ్రీనివాస్ నేరుగా పట్టుబడ్డాడు. తన టేబుల్ వద్దకు డిస్పాచ్ సెక్షన్ నుంచి సోమవారం సాయంత్రం వచ్చిన ఓ లేఖ కవర్ అతుకు అనుమానాస్పదంగా ఉండటాన్ని ఎస్పీ గమనించారు. లేఖ ఎప్పుడో పోస్ట్ చేసినా గమ్ ఆరకపోవడంతో అనుమానించారు. తన వద్దకు రావడానికి ముందే ఆ లేఖ తెరిచారని గుర్తించిన ఎస్పీ.. తక్షణమే డిస్పాచ్ సెక్షన్ క్లర్క్ శ్రీనివాస్‌ను తన చాంబర్కి పిలిపించారు. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీల ఎదుటే ఏం చేశావని ప్రశ్నించారు. ముందు నీళ్లు నమిలిన శ్రీనివాస్.. చేసిన తప్పును నిస్సిగ్గుగా అంగీకరించాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ అధికారుల ఎదుటే చీవాట్లు పెట్టారు. శ్రీనివాస్‌కు తక్షణమే చార్జి మెమో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా తమ తమ సెక్షన్లకు లేదా అధికారుల వ్యక్తిగత పేర్లతో వస్తున్న లేఖలు తెరిచి చదివినట్లు అనుమానాలుంటే అధికారులు, సిబ్బంది ఫిర్యాదు చేసేలా సెక్షన్లకు సూచనలివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీనివాస్ పదేళ్లుగా ఒకే సెక్షన్లో కొనసాగుతున్నాడని ఎస్పీ దృష్టికి వచ్చింది. ఇదే తరహాలో ప్రజల పిటిషన్లు తెరచి చూస్తున్నాడనే అనుమానాలు తలెత్తడంతో అతడి వ్యవహార శైలిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఏసీబీ వలలో డిప్యూటీ డీఈఓ సీసీ
ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయ క్యాంప్ క్లర్క్ (సీసీ)బి.జ్ఞానేశ్వరరావు శుక్రవారం చిక్కాడు. ఓ ప్రైవేటు స్కూల్‌కు ప్రొవిజనల్ రికగ్నైజేషన్ (పీఆర్) కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక గంఠాపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో జ్ఞానేశ్వరరావును పట్టుకున్నారు. వివరాలు.. ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలనీలో చండ్ర రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చైతన్య హైస్కూల్‌ను కరస్పాండెంట్ గుడిపూడి హరిబాబు నిర్వహిస్తున్నాడు. హరిబాబు 2017 నవంబర్ 23 నుంచి స్కూల్ నడుపుతున్నాడు. అప్పట్లో గుంటూరు ఆర్జెడీ ఇచ్చిన అనుమతితో పాఠశాల నడుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) నుంచి ప్రొవిజనల్ రికగ్నైజేషన్ పొందాల్సి ఉంది. అందుకు ఒంగోలు డిప్యూటీ డీఈఓ పాఠశాలను తనిఖీ చేసి నిబంధనల మేరకు అన్ని వసతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉంది. అందుకోసం హరిబాబు 2017 డిసెంబర్ 13న బ్యాంకులో చలానా కట్టాడు. ఆ తర్వాత దరఖాస్తును డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో ఇచ్చాడు. దరఖాస్తు చేసి ఐదు నెలలు కావస్తున్నా «పక్కన పెట్టేశారు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 4న వెంకటేశ్వర కాలనీలోని పాఠశాల వద్దకు డిప్యూటీ డీఈఓ, సీసీలు ఇద్దరూ వెళ్లి తనిఖీ చేశారు. నివేదిక రూపొందించారు. పదో తరగతి ఫలితాలు విడుదల కావటం, ఇక నుంచి విద్యార్థులకు టీసీలు ఇవ్వాల్సి ఉండటంతో హరిబాబు తరుచూ కార్యాలయానికి వెళ్లి కలుస్తూనే ఉన్నాడు. డీఈఓకు నివేదిక పంపాలంటే డిప్యూటీ డీఈఓ దయానందం, సీసీ జ్ఞానేశ్వరరావులు రూ.30 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కార్యాలయంలోనే ఉన్న జ్ఞానేశ్వరరావు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన రూ.5 వేలు ఇచ్చి ఫైలు తీసుకెళ్లమన్నాడు. డిప్యూటీ డీఈఓకి ఇవ్వాల్సిన డబ్బులు అతనికే ఇవ్వమని సూచన కూడా చేశాడు. ఇక చేసేదిలేక డబ్బులు ఇచ్చి ఫైలు తీసుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ తోట ప్రభాకర్, సీఐ టీవీవీ ప్రతాప్ కుమార్, సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా ఆయన్ను పట్టుకున్నారు. అక్కడి నుంచే డిప్యూటీ డీఈఓకు హరిబాబు ఫోన్ చేశాడు. ఫైల్ తీసుకున్నాను.. మీ డబ్బులు ఇస్తాను..అని పేర్కొన్నాడు. కోర్టు వద్ద ఉన్నాను రమ్మని చెప్పాడు. ముందు హరిబాబు ఆ తర్వాత ఏసీబీ అధికారులు కోర్టు వద్దకు వెళ్లారు. మరి ఏసీబీ దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నాడో ఏమో అక్కడ డిప్యూటీ డీఈఓ దయానందం లేడు. రెండు మూడు చోట్ల ప్రయత్నించినా అందుబాటులో లేకపోగా సెల్‌ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసేశాడు. జ్ఞానేశ్వరరావు మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం :తోట ప్రభాకర్, ఏసీబీ డీఎస్పీ డిప్యూటీ డీఈఓ దయానందాన్ని కూడా పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశాం. ఒప్పందం ప్రకారం అతను రూ.10 వేలు తీసుకోవాల్సి ఉంది. అతనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. జ్ఞానేశ్వరరావు 2017 మే నెల 19వ తేదీ వరకు మద్దిపాడు హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో సీసీగా డిప్యూటేషన్‌పై వచ్చాడు. హైస్కూల్ ప్రొవిజనల్ రికగ్నైజేషన్ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఇష్టం లేని కరస్పాండెంట్ హరిబాబు ఈ నెల 8న మమ్మలను కలిశాడు. దీంతో వలపన్నాం. డిప్యూటీ డీఈఓ దయానందం మాత్రం తప్పించుకోగలిగాడు. -
ఏసీబీ వలలో మునిసిపల్ తిమింగలాలు
పాలకొల్లు టౌన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం రూ.30 వేలు డిమాండ్ చేసిన మునిసిపల్ మేనేజర్ ఇందుకు సహకరించిన మునిసిపల్ గుమస్తాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన పాలకొల్లు పురపాలక సంఘంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు మునిసిపల్ కార్యాలయంలో శిలార ఆంజనేయ దుర్గాప్రసాద్ అటెండర్‌గా పనిచేస్తూ గత ఏప్రిల్ 13న గుండెపోటుతో మృతిచెందారు. అతని కుమారుడు హరీష్‌కు మునిసిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాలని మృతుని భార్య రమామణి మునిసిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా దీనికి సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్ కాలయాపన చేస్తున్నారు. రూ.30 వేలు ఇస్తేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేశారు. దీనిపై మతుడు బావమరిది మునిసిపల్ లై్ర» రీలో అటెండర్‌గా పనిచేస్తున్న కటికిరెడ్డి చక్రధరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని రూ.30 వేలను చక్రధరరావుకు ఇచ్చి పంపారు. చక్రధరరావు ఈ మొత్తాన్ని తీసుకుని మునిసిపల్ కార్యాలయానికి రాగా గుమస్తా సి.గోపాలకృష్ణకు ఇవ్వాలని మేనేజర్ తారకనాథ్ సూచించారు. దీంతో సొమ్మును గోపాలకష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర మునిసిపాలిటీలో ఫైళ్లను పరిశీలించి కమిషనర్ కోనేరు సాయిరామ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంచం అడిగిన మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్‌ను, సొమ్ము తీసుకున్న గుమస్తా గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తారకనాథ్ గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లి మునిసిపల్ కమిషనర్‌గా పనిచేస్తుండగా ఓ వ్యవహారంలో లంచం తీసుకుంటూ దొరికిపోయాని ఏసీబీ అధికారులు తెలిపారు. పాలకొల్లు మునిసిపాలిటీ చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు ఇదే మొదటిది కావడం మునిసిపల్ ఉద్యోగుల్లో కలకలం రేపింది.