సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తూ..
ఎస్పీ కార్యాలయంలో క్లర్క్ నిర్వాకం
నేరుగా ఎస్పీ లేఖనే తెరచి,చదివి, పట్టుబడిన వైనం
చార్జిమెమో ఇచ్చి, విచారణకు ఆదేశం
కాకినాడ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయం డిస్పాచ్ సెక్షన్‌లోని ఓ క్లర్క్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కంచే చేను మేసిన చందంగా జి.శ్రీనివాస్ అనే క్లర్క్ వ్యవహరించాడు. డిస్పాచ్ సెక్షన్‌లో ఉంటూ వివిధ విభాగాలకు.. ముఖ్యంగా అధికారులకు వస్తున్న లేఖలను చాటుగా ఎన్వలప్‌లు తెరచి చదువుతూండటం అధికారులను, సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఆ లేఖల ఫొటోలు తన సెల్‌ఫోన్‌లో తీసుకొని, మళ్లీ వాటిని అతికించి, ఏమీ ఎరుగనట్లు అధికారుల సెక్షన్లకు పంపిస్తున్నాడనే విషయం బట్టబయలైంది. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ వద్ద శ్రీనివాస్ ఆటలు సాగలేదు.
ఎస్పీకి స్వయానా ఆయన పేరుతో వచ్చిన ఓ లేఖను చదివి శ్రీనివాస్ నేరుగా పట్టుబడ్డాడు. తన టేబుల్ వద్దకు డిస్పాచ్ సెక్షన్ నుంచి సోమవారం సాయంత్రం వచ్చిన ఓ లేఖ కవర్ అతుకు అనుమానాస్పదంగా ఉండటాన్ని ఎస్పీ గమనించారు. లేఖ ఎప్పుడో పోస్ట్ చేసినా గమ్ ఆరకపోవడంతో అనుమానించారు. తన వద్దకు రావడానికి ముందే ఆ లేఖ తెరిచారని గుర్తించిన ఎస్పీ.. తక్షణమే డిస్పాచ్ సెక్షన్ క్లర్క్ శ్రీనివాస్‌ను తన చాంబర్‌కి పిలిపించారు. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీల ఎదుటే ఏం చేశావని ప్రశ్నించారు.
ముందు నీళ్లు నమిలిన శ్రీనివాస్.. చేసిన తప్పును నిస్సిగ్గుగా అంగీకరించాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ అధికారుల ఎదుటే చీవాట్లు పెట్టారు. శ్రీనివాస్‌కు తక్షణమే చార్జి మెమో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా తమ తమ సెక్షన్లకు లేదా అధికారుల వ్యక్తిగత పేర్లతో వస్తున్న లేఖలు తెరిచి చదివినట్లు అనుమానాలుంటే అధికారులు, సిబ్బంది ఫిర్యాదు చేసేలా సెక్షన్లకు సూచనలివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీనివాస్ పదేళ్లుగా ఒకే సెక్షన్‌లో కొనసాగుతున్నాడని ఎస్పీ దృష్టికి వచ్చింది. ఇదే తరహాలో ప్రజల పిటిషన్లు తెరచి చూస్తున్నాడనే అనుమానాలు తలెత్తడంతో అతడి వ్యవహార శైలిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment